
గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో ముంబై సిటీ, గోవా ఫుట్ క్లబ్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ 3-3తో డ్రా అయింది. ఆసాంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో గోల్ కొట్టిన గోవా ఓటమి నుంచి గట్టెక్కింది. ముంబై సిటీ తరఫున హ్యుగో బోమస్(20వ నిమిషం), ఆడమ్ లె ఫాండ్రే(26వ నిమిషం), రోలింగ్ బోర్గెస్(90వ నిమిషం) గోల్స్ చేయగా.. గోవా ఎఫ్‌సీ తరఫున గ్లెన్ మార్టిన్(45వ నిమిషం), ఇగోర్ అంగులో(51వ నిమిషం), ఇషాన్ పండిత (90+6 నిమిషం) గోల్స్ అందించారు.
మ్యాచ్ ఆసాంతం ఇరు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. ఆట ప్రారంభమైన 20వ నిమిషంలో హ్యుగో బోమస్ గోల్ కొట్టి ముంబై ఖాతా తెరిచాడు. మరో 6 నిమిషాల వ్యవధిలోనే ఆడమ్ లె ఫాండ్రే మరో గోల్ చేయడంతో ముంబై ఆధిక్యం 2-0 డబుల్ అయింది. ఇక ఫస్టాఫ్ ముగుస్తుందనగా 45వ నిమిషంలో గోవా ఖాతా తెరిచింది. గ్లెన్ మార్టిన్స్ అద్భుతమైన గోల్ చేసి ముంబై ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. సెకండాఫ్ మొదలవ్వగానే ఇగొర్ అంగులో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. 51వ నిమిషంలో లభించిన ఈ గోల్ ద్వారా ఇరు జట్లు స్కోర్లు 2-2గా నిలిచాయి.
హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ ముగుస్తుందనగా 90వ నిమిషంలో రోలింగ్ బోర్గెస్ గోల్ చేసి ముంబైకి 3-2 ఆధిక్యత తెచ్చిపెట్టాడు. అయితే రిఫరీ మరో 6 నిమిషాల ఇంజ్యూరీ టైమ్ కలిపాడు. 90+6వ నిమిషంలో గోవా ఆటగాడు ఇషాన్ పండిత గోల్ చేసి ఓడిపోతుందనుకున్న గోవాను రక్షించాడు. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 3-3తో సమానంగా ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎడ్యూబెడియాకు డీహెచ్‌ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, రోలింగ్ బోర్గెస్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 10 విజయాలతో ముంబై సిటీ టాప్‌లో కొనసాగుతుండగా.. 5 గెలుపులతో గోవా మూడో స్థానంలో ఉంది.