
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై భారత స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీతో మాట్లాడితే క్రికెటే కాకుండా జీవితం గురించి కూడా నేర్చుకోవచ్చని కొనియాడాడు. ఇక మహీని అర్థం చేసుకోవడానికి తనకు ఆరేళ్ల సమయం పట్టిందన్న ఇషాంత్.. 2013లో ధోనీ గొప్పతనం తెలిసిందన్నాడు
2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో భారత జట్టలోకి వచ్చిన ఇషాంత్ శర్మ.. కెరీర్ ప్రారంభంలో ధోనీతో ఎక్కువగా మాట్లాడేవాడి కాదని తెలిపాడు. కానీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో యువ క్రికెటర్లతో ధోనీ వ్యవహరిస్తున్న తీరుకి తాను ఫిదా అయిపోయినట్లు లంబూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే ధోనీని అర్థం చేసుకోవడం తాను ప్రారంభించానని స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్'షోలో ఇషాంత్ శర్మ వెల్లడించాడు.
'భారత్ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీతో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. కానీ 2013 తర్వాత అతనితో నెమ్మదిగా మాట్లాడుతూ.. క్రమంగా మహీని అర్థం చేసుకోవడం ప్రారంభించా. యువ క్రికెటర్లతో ధోనీ చక్కగా మాట్లాడతాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా చాలా సరదగా వ్యవహరిస్తాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన గదికి రావొద్దని ఎవరికి చెప్పడు. ఏ ఆటగాడైన మరే సమయంలోనైనా నిరభ్యంతరంగా మహీ గదికి వెళ్లవచ్చు. బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువగా ధోనీ రూమ్‌కు వెళ్తుంటాడు. ధోనీతో మాట్లాడితే క్రికెట్ గురించే కాకుండా జీవితం గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు'అని ఇషాంత్ శర్మ వెల్లడించాడు.
ఇక ధోనీ సారథ్యంలోనే ఎక్కువగా ఆడిన ఇషాంత్.. భారత్ తరఫున ఇప్పటి వరకు 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 420 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో మరీ ముఖ్యంగా.. విదేశాల్లో ప్రధాన బౌలింగ్ అస్త్రంగా ఇషాంత్ శర్మనే టీమిండియా ఉపయోగించుకుంటుంది.