టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చిన్న గాయంతో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఇషాన్.. తిరువనంతపురం వేదికగా శనివారం జరిగిన ఐదో టీ20లో ఇరగదీసాడు.
తనకే సాధ్యమైన సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్‌కు ఇది రెండో అర్థ శతకం. ముఖ్యంగా ఇష్ సోదీపై ఇషాన్ కిషన్ విరుచుకుపడ్డాడు. అతను వేసిన 12వ ఓవర్‌లో నాలుగో ఫోర్లు, 2 సిక్స్‌లతో 6 బంతులను బౌండరీకి తరలించాడు.
ఈ ఓవర్ ఇష్ సోధీ వైడ్‌తో ప్రారంభించాడు. ఔట్ సైడ్ ఆఫ్ దిశగా ఫుల్ టాస్ వేసిన తొలి బంతిని ఇషాన్ కిషన్ డీప్ కవర్ దిశగా బౌండరీ తరలించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి రెండు బంతులను బౌండరీలకు తరలించి హ్యాట్రిక్ ఫోర్స్ నమోదు చేశాడు. నాలుగో బంతికి స్టెప్ ఔటై డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఐదో బంతిని రివర్స్ స్వీప్ షాట్‌తో థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ తరలించిన ఇషాన్ కిషన్.. ఆఖరి బంతికి మరోసారి స్టెప్ ఔటై డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ తరలించాడు. దాంతో ఈ ఓవర్‌లో 29 పరుగులు వచ్చాయి.

గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. బ్యాకప్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా జట్టులో వచ్చిన ఈ జార్ఖండ్ డైనమైట్.. తిలక్ వర్మ అనూహ్య గాయంతో అవకాశం అందుకొని తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
కైల్ జెమీసన్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌పై ఇషాన్ కిషన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయిన గ్లేన్ ఫిలిప్స్ వదిలేసాడు. దాంతో ఆ క్యాచ్ కాస్త సిక్సర్‌గా మారింది. సాంట్నర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 42 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అతనికి ఇదే ఫస్ట్ సెంచరీ. శతకం అనంతరం అదే జోరులో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.