అహ్మదాబాద్: టీ20 క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్, యావరేజ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. మ్యాచ్ పరిస్థితుల గురించి ఎవరు ఆలోచించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. స్ట్రైక్‌రేట్, యావరేజ్ కంటే పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని తెలిపాడు. 140-150 పరుగుల లక్ష్యాన్ని కఠిన పిచ్‌పై చేధించాల్సినప్పుడు 200 లేదా 250 స్ట్రైక్‌రేట్‌తో ఆడటం అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 ఆడేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమవ్వగా.. ఇషాన్ కిషన్ టీమ్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీతో ఎక్కువ మాట్లాడేందుకు ఇష్టపడతానని, అతనో గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు.

బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ తనకు ఎంతో మేలు చేశాడని, తనకు చాలా సార్లు మద్దుతుగా నిలిచాడని చెప్పుకొచ్చాడు. 'రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. యువ ఆటగాళ్లకు అండగా ఉంటాడు. జట్టులోని ప్రతీ ఒక్కరికి మద్దతుగా నిలుస్తాడు. కుర్రాళ్లు భయాందోళనకు లోనైప్పుడల్లా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు.
నేను ఉన్నాను అనే భరోసాను ఇస్తాడు. ప్రతీ ప్లేయర్ పట్ల చాలా ప్రశాంతంగా ఉంటాడు. కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం పెంచేలా రోహిత్ శర్మ మాట్లాడటం నేను చాలా సార్లు చూశాను. అండగా నిలిచి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతాడు. 'నేను నిన్ను నమ్ముతున్నాను'అని కుర్రాళ్లకు పదే పదే చెబుతాడు. ఏ బౌలర్ అయిన ఒత్తిడిలో కనిపిస్తే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు.
'ఒత్తిడి తీసుకోకు. ఎంజాయ్ చేస్తూ బౌలింగ్ చేయ్. పరుగులిచ్చినా పర్వాలేదు. నీ కోసం పరుగులు చేసేందుకు మేం ఉన్నాం.'అనే భరోసా ఇస్తాడు. నాకు కూడా రోహిత్ భాయ్ చాలా హెల్ప్ చేశాడు. ఇన్నింగ్స్‌ను ఎలా అప్రోచ్ అవ్వాలో నేర్పించాడు. చాలా సార్లు నాకు అండగా నిలిచాడు. అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
ధోనీ ఓ గొప్ప కెప్టెన్. అతను ఎంతటి మేటి ఆటగాడో మనందరికి తెలుసు. మనకు చాలా ట్రోఫీలు అందించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీ భాయ్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అతని నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 30.27 సగటుతో 454 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి.