
సెయింట్ కిట్స్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా పంపిస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం ఎట్టకేలకు ఫలించింది. వెస్టిండీస్ పర్యటనలో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో సూర్యను ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. తొలి రెండు టీ20ల్లో పెద్దగా రాణించని సూర్య.. మూడో టీ20లో దుమ్మురేపాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. సూర్య ధాటికి భారత్ 7 వికెట్లతో సునాయస విజయాన్నందుకుంది.
దాంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్‌ను యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ చిట్ చాట్ సందర్భంగా సూర్య సతీమణి దేవిషాకు ఇషాన్ వినూత్న విజ్ఞప్తి చేశాడు. అస్సలు భారత మ్యాచ్‌లకు హాజరుకావద్దని రిక్వెస్ట్ చేశాడు.
ఇటీవల సూర్య రెండు భారీ ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఆ రెండు మ్యాచ్‌లకు దేవిషా హాజరు కాలేదు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో సూర్య సెంచరీతో చెలరేగగా.. ఆ మ్యాచ్‌కు దేవిషా హాజరవ్వలేదు. తాజా పర్యటనలో విండీస్‌తో మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించగా.. ఈ మ్యాచ్‌కు దేవిషా దూరంగా ఉంది. ఈ క్రమంలోనే ఇషాన్.. ఆమె మ్యాచ్‌కు రాకపోవడమే మంచిదంటూ కామెంట్ చేశాడు. అయితే సూర్య మాత్రం ఈ వాదనను తప్పుబట్టాడు.
అస్సలు జీవిత భాగస్వామి మ్యాచ్‌కు రావాల్సిన అవసరం లేదన్నాడు. ఏదైమైనా ఆమె ఎప్పటికీ తనతోనే ఉంటుందని, ఆమె పేరును నా శరీరంపై టాటూ వేసుకున్నానని తెలిపాడు. దాంతో ఎప్పుడూ ఆమె తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, మ్యాచ్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదన్నాడు.
ఇక ఇంటర్వ్యూ చివరిలో కెమెరా వైపు చూసిన ఇషాన్..'దేవిషా బాబీ, మీరు మా రూమ్స్ బిల్లులు చెల్లించండి. అలాగే తదుపరి మ్యాచ్‌లకు హాజరవ్వకండి'అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (76), శ్రేయస్ అయ్యర్ (27), రిషభ్ పంత్ (33*) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5 బంతుల్లో 11 రిటైర్‌హర్ట్: ఒక సిక్స్, ఒక ఫోర్) దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా నడుం వద్ద కండరాలు పట్టేయడంతో మైదానం వదిలి పెట్టాల్సి వచ్చింది.