
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో తుది జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. యావత్ దేశం తన గురించి మాట్లాడుకునే ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీ బాది దిగ్గజాల సరసన చేరాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకొని వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్‌తో కలిసి చిట్ చాట్ చేసిన ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'నేను అప్పుడు 197 పరుగుల వద్ద ఉన్నానుకుంటా. ముస్తాఫిజురు నాకు తక్కువ వేగంతో బంతులు వేస్తే.. సిక్స్ కొట్టాలని ఎదురు చూస్తున్నాను. అయితే, నాకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనే బరిలోకి దిగే అవకాశం వచ్చింది. దీన్ని మిస్ చేసుకోకూడదనుకున్నాను. వెంటనే మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ వద్దకు వెళ్లి.. సింగిల్స్ మాత్రమే తీయాలని నాకు గుర్తు చేస్తుండాలని.. లేకపోతే నేను పెద్ద షాట్‌కు వెళతానని చెప్పాను. దీంతో కోహ్లీ కూడా సింగిల్స్‌తోనే 200 పూర్తి చేయాలని గుర్తు చేశాడు. ఫలితంగా ఈ ఘనత సాధించాను' అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.

ఇక తాను 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా సిక్స్ కొట్టి సెంచరీ చేయాలని అనుకున్నానని.. 'ఇది నీ తొలి సెంచరీ.. సింగిల్స్‌తో జాగ్రత్తగా ఆడాలని కోహ్లీ భాయ్ సూచించాడని ఇషాన్ కిషన్ తెలిపాడు. ఔటవ్వకుండా ఉంటే ట్రిపుల్ సెంచరీ బాదేవాడినని చెప్పిన ఇషాన్ కిషన్.. తాను ఔటయ్యే సమయానికి ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు సూరకుమార్ యాదవ్‌తో మాట్లాడానని చెప్పిన ఇషాన్.. బంతిని స్పష్టంగా చూసి ఆడాలని, ఒత్తిడి లేకుండా స్వేచ్చగా బ్యాటింగ్ ఆస్వాదించాలని చెప్పాడని తెలిపాడు.