మైదానంలో చేసిన ఆ పనికి రోహిత్ భాయ్ బండ బూతులు తిట్టాడు: ఇషాన్ కిషన్

ముంబై: కెరీర్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బండ బూతులు తిట్టాడని ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో రూ. 15.25 కోట్ల భారీ ధర పలికిన ఇషాన్ కిషన్.. తనపై ముంబై ఖర్చు చేసిన దానికి న్యాయం చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో పాల్గొన్న ఇషాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఫస్ట్ ఐపీఎల్ వేలం నుంచి అంతర్జాతీయ అరంగేట్రం వరకు సాగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ చేతిలో తిట్లు తిన్నానని తెలిపాడు.

రోహిత్ మందలించాడు..
'ముంబై ఇండియన్స్ తరఫున నా ఫస్ట్ సీజన్‌లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ భయ్యా నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని పాతగా మార్చాలనే ఉద్దేశంతో నేను దాన్ని మైదానంలోని తేమలో దొర్లించాను. బంతిని పాతగా చేస్తే రోహిత్ భయ్యా మెచ్చుకుంటాడనుకున్నా. కానీ అతను నాపై అరుస్తూ తన టవల్‌తో బంతిని తుడిచాడు. అప్పుడు నేను పెద్ద తప్పిదం చేశానని అర్థమైంది. నేను బాధపడుతున్నానని గ్రహించిన రోహిత్.. వ్యక్తిగతంగా తీసుకోవద్దని, మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ నీకే తెలుస్తుందని చెప్పాడు.

రాహుల్ చాహర్ సక్సెస్ క్రెడిట్..
రోహిత్ చాలా సరదాగా ఉంటాడు. కానీ అతని ఆలోచనలు మైదానంలోనే పరుగెడుతాయి. బ్యాటర్ ఏ షాట్ ఆడుతాడోననే విషయాన్ని ముందే పసిగట్టగలడు. చాలా సార్లు అతను చెప్పినట్లే బ్యాటర్లు షాట్లు ఆడారు. స్పిన్నర్ రాహుల్ చాహర్ సక్సెస్‌లో రోహిత్ భాయ్ పాత్ర ఎంతో ఉంది. నేను దగ్గరుండి చూశాను. రోహిత్ భాయ్ మెళకువలతోనే రాహుల్ చాహర్ మేటీ స్పిన్నర్‌గా తయారయ్యాడు. బ్యాట్స్‌మన్‌కు తగ్గట్లు ప్లాన్ రచిస్తూ.. అతని ఆత్మవిశ్వాసం పెంచేవాడు.

విరాట్ భాయ్ సూచనలతోనే..
అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టాను. అయితే అది విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఆ భారీ సిక్సర్ బాదాను. నేను మైదానంలోకి రాగానే అక్కడ ఫీల్డర్లు లేరు ఆ దిశగా సిక్స్ కొట్టమని విరాట్ భాయ్ సలహా ఇచ్చాడు. అయితే ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. కానీ అతను చెప్పింది వాస్తమమే అనిపించింది. సిక్స్ కొట్టాలని గట్టిగా నిర్ణయించుకొని బాదాను.

బీపీ చెకప్ కోసం..
ఐపీఎల్ 2018 వేలంలో భారీ ధర పలికిన తర్వాత మా నాన్న బీపీ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో నేను నా స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడటానికి వెళ్లాను. అయితే మా బ్రదర్ నాకు ఫోన్ చేసి భారీ ధర పలికావని చెప్పాడు. వెంటనే నేను ఇంటికి వెళ్లగా మా అమ్మ, అందరూ భావోద్వేగానికి గురయ్యారు. నాన్న ఎక్కడా? అని అడిగితే బీపీ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని చెప్పింది.'అని ఇషాన్ కిషన్ గుర్తు చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications