టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉండాలని ఈ 25 ఏళ్ల యువ బ్యాటర్ నిర్ణయించుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇషాన్ కిషన్.. ఆ సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే సౌతాఫ్రికా పర్యటనలోని రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడకుండా స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఈ విషయంపై అటు ఇషాన్ కిషన్ కానీ ఇటు బీసీసీఐ కానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇషాన్ కిషన్ సౌతాఫ్రికా పర్యటన నుంచి స్వదేశం తిరిగి వచ్చాడని బీసీసీఐ వర్గాలు నేషనల్ మీడియాకు తెలిపాయి.

'మానసికంగా అలసిపోయానని ఇషాన్ కిషన్ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. క్రికెట్ నుంచి కొన్నాళ్ల పాటు విరామం కావాలని రిక్వెస్ట్ చేశాడు. మేనేజ్‌మెంట్ కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకొని ఈ విన్నపాన్ని అంగీకరించింది.'అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.
రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. ఆడపా దడపా అవకాశాలు అందుకున్నాడు. రిషభ్ పంత్ బ్యాకప్‌గా కొన్నాళ్లు జట్టులో కొనసాగిన అతను తర్వాత ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. పంత్ రోడ్డు ప్రమాదంతో ఇషాన్ కిషన్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలను కూడా ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు.
వన్డేల్లో డబుల్ సెంచరీతో పాటు ఓ సెంచరీ కూడా నమోదు చేశాడు. టీ20ల్లోనూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే కేఎల్ రాహుల్ తిరిగి రావడం.. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ నుంచి పోటీ నెలకొనడంతో అతను చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్.. సౌతాఫ్రికా పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడం.. జితేశ శర్మకు అవకాశం ఇవ్వడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నిర్ణయం అతనిపై మరింత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికైనా.. తొలి ప్రాధాన్యత రాహుల్‌కే ఉండటంతో అతను తప్పుకోవడమే ఉత్తమమని భావించాడు.
ఐపీఎల్ వరకు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 రన్స్ చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.