సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, కెప్టెన్ ఇషాన్ కిషన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నితీష్ కుమార్ రెడ్డి టీమిండియా టెస్ట్ టీమ్‌లో ఉన్నాడని గుర్తు చేస్తూ ఇషాన్ కిషన్ నవ్వులు పూయించాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్, జయదేవ్ ఉనాద్కత్, అభిషేక్ శర్మ సందడి చేశారు.
ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నలకు నితీశ్ కుమార్ రెడ్డి చురుకైన సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ జోక్యం చేసుకొని తన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు. పవర్ ప్లే ఆడటం ఇష్టమని నితీష్ కుమార్ రెడ్డి తెలుపగా.. ఆరో స్థానంలో ఆడుతావని ఇషాన్ గుర్తు చేశాడు. జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్దమని నితీష్ రెడ్డి స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

హోస్ట్: నితీష్, మీకు ఒక చిన్న రాపిడ్ ఫైర్. టెస్ట్ లేదా టీ20 క్రికెట్.. ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం?
నితీష్ రెడ్డి: టీ20!(కొంచెం కూడా ఆలోచించకుండా)
ఇషాన్ కిషన్: ఓరేయ్.. నువ్వు టీమిండియా టెస్ట్ టీమ్‌లో కీలక సభ్యుడివి రా! సెలెక్టర్లు ఇవన్నీ వింటూ ఉంటారు జాగ్రత్త. మైక్ ఆన్‌లోనే ఉంది (నవ్వుతూ).
నితీష్ రెడ్డి: (నవ్వుతూ సర్దుకుంటూ) లేదు.. అంటే అన్నీ ఇష్టమే, కానీ ప్రస్తుతం ఐపీఎల్ మూడ్‌లో ఉన్నా కదా!
హోస్ట్: సరే, మరి టీ20, వన్డే.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారు?
నితీష్ రెడ్డి: వన్డే క్రికెట్
ఇషాన్ కిషన్: అవును నితీష్ చాలా మంచి క్రికెటర్
హోస్ట్: నితీష్, మీకు పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం ఇష్టమా? లేక డెత్ ఓవర్లలోనా?
నితీష్ రెడ్డి: పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడమే నాకు చాలా ఇష్టం.
ఇషాన్ కిషన్: (నవ్వుతూ) ఓరేయ్.. నువ్వు బ్యాటింగ్ చేసేది 6వ నంబర్‌లో. నువ్వు పవర్ ప్లేలో ఎలా బ్యాటింగ్ చేస్తావ్?
నీకు ఎంత ఇష్టం ఉన్నా అది సాధ్యం కాదు రా అయ్యా!
నితీష్: నాకు పవర్ ప్లేలో ఆడటం ఇష్టమని చెబుతున్నా.. అదే విధంగా డెత్ ఓవర్లలోనూ ఆడేస్తా. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం.
ఇషాన్: కేవలం తప్పు సమాధానాలు చెప్పాలని మీరేమైనా అడిగారా?(నవ్వుతూ)