ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బ్యాటింగ్ అని, అందుకే వారిని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తున్నామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ వికెట్ బాగుంది. సన్‌రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్. ముందుగా వారు బ్యాటింగ్ చేయనివ్వండి. రెండో ఇన్నింగ్స్‌లో మేం వారిపై ఒత్తిడి పెంచుతాం. ఇది కొత్త సవాలు ఏమీ కాదు. కానీ ఈ జట్టు మమ్మల్ని దెబ్బతీయగలదు. వికెట్ ఖచ్చితంగా బాగున్నట్లు కనిపిస్తోంది, కానీ ఇందులో ఏదో ఉంది. మొదటి 6 ఓవర్ల తర్వాత బంతి కొంచెం ఆగి వచ్చే అవకాశం ఉంది. జట్టులో కేవలం ఒకే ఒక మార్పు, నోకియా స్థానంలో మణిమారన్ సిద్ధార్థ్ జట్టులోకి వచ్చాడు.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.

మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన ఇషాన్ కిషన్.. ఆఫ్ స్పిన్ ఆప్షన్ కోసం లివింగ్ స్టోన్‌ను ఆడిస్తున్నామని చెప్పాడు. 'ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సొంత ప్రేక్షకుల ముందుకు రావడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. జట్టులో రెండు మార్పులు చేశాం.
లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చారు. ఉప్పల్ మైదానంలో హర్షల్‌కు మంచి రికార్డు ఉంది. లివింగ్‌స్టోన్ మాకు ఆఫ్-స్పిన్ ఆప్షన్‌ను అందిస్తాడు. సరైన నిర్ణయాలు తీసుకోవడమే అన్నిటికంటే ముఖ్యం. మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. రెండు పాయింట్లు సాధించడం ముఖ్యం. కానీ మేం ప్రశాంతంగా ఉంటూ ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
లక్నో సూపర్ జెయింట్స్:
మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.