విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడా? మరీ ఈ పరుగులన్నీ ఎవరు చేసారు? ఘనతలే శాపాలుగా..

హైదరాబాద్: ఇంగ్లండ్ గడ్డపై విఫలమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు నుంచి తప్పించాలంటూ కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నారు. సుమారు 24 వేల అంతర్జాతీయ పరుగులు...మూడు ఫార్మాట్‌లలో 50కి పైగా సగటు...దశాబ్దకాలం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆటపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతనిపై ఇలాంటి వ్యాఖ్యలు మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఇన్నేళ్లుగా దేశం తరఫున అతను చూపిన గొప్ప ప్రదర్శనలు, అందించిన ఘనమైన విజయాలు, చిరస్మరణీయ క్షణాలను కనీసం లెక్కలోకి తీసుకోకుండా దిగ్గజ క్రికెటర్లు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

మెరుగైన గణంకాలే..
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ 24 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 45.26 సగటు, 91.39 సగటుతో 1041 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఎలాంటి, ఏ స్థాయి ప్రమాణాల ప్రకారం చూసినా వన్డేల్లో ఇవి ఎంతో మెరుగైన బ్యాటింగ్ గణాంకాలు. 2020 జనవరి నుంచి విరాట్ 21 అంతర్జాతీయ టీ20ల్లో 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదీ టీ20లో ఒక రెగ్యులర్, పూర్తి స్థాయి బ్యాటర్ కోణంలో చూస్తే చక్కటి ప్రదర్శన. గత రెండున్నరేళ్లుగా 18 టెస్టుల్లో 27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే. ఒక్క సెంచరీ కూడా లేదు. ఇది మాత్రం విమర్శకు అవకాశమిచ్చే అతి సాధారణ ప్రదర్శన. కానీ ఇదే సమయంలో ఇతర భారత టెస్టు బ్యాటర్ల స్కోర్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు.

ఘనతలే శాపంగా..
అయినా విరాట్‌ను ఎందుకు విమర్శిస్తున్నారంటే.. అతను సాధించిన ఘనతలే. అవే ఇప్పుడు అతనికి శాపంగా మారాయి. అద్భుత ప్రదర్శనతో అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీ...ఇప్పుడు వాటితో పోలిక రావడంతోనే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లీ కాకుండా మరే బ్యాట్స్‌మన్ అయినా ఈ గణాంకాలతో కొనసాగితే అతను ఫామ్‌లో ఉన్నట్లే లెక్క. గత మూడేళ్లుగా విరాట్ సెంచరీ చేయకపోవడం కూడా ఈ విమర్శలకు కారణమైంది. అడపాదడపా అతను హాఫ్ సెంచరీలు బాదినా అవి సగటు అభిమాని లెక్కలోకి రాలేదు.

సెంచరీ చేయకపోవడంతో..
కోహ్లీ 2019 నవంబర్‌లో తన ఆఖరి సెంచరీ బాదాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని 70 సెంచరీలు పూర్తయ్యాయి. మరొక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్ (71)ను సమం చేస్తాడు. గతంలో ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ సెంచరీల రికార్డు (100) కూడా అలవోకగా సమం చేయగల సత్తా ఉందని అంతా కోహ్లీపై అంచనాలు పెంచేసుకున్నారు. కోహ్లీ 71వ సెంచరీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు రాలేదు! దాంతో అదే అసహనం సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్ల ద్వారా విమర్శగా మారింది.

యువ ఆటగాళ్లు ధాటిగా ఆడుతుండటంతో..
నిజానికి సెంచరీలు లేకపోయినా కోహ్లీ ఆట ఘోరంగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే చక్కటి షాట్లు, కళాత్మక ఆటతీరులో ఎక్కడా తేడా రాలేదు. క్రీజ్‌లో తడబడటం, షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడటం కూడా కనిపించలేదు. నాటింగ్‌హామ్‌లో జరిగిన చివరి టీ20లో మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఫోర్, ఆ తర్వాత నేరుగా కొట్టిన సూపర్ సిక్సర్ కోహ్లీ సత్తా ఏమిటో చూపించాయి. ఇటీవల అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు కోహ్లీని సాధారణ బ్యాటర్‌గా చూపిస్తోంది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతుండటం.. కోహ్లీ కోసం వీరిని పక్కనపెట్టాల్సిన పరిస్థితులు వస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications