IPL 2022: నోకియా ఫోన్‌లా విరాట్ కోహ్లీ.. పాత చింతకాయ పచ్చడి షాట్లతో అట్టర్ ఫ్లాఫ్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ కింగ్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో ఈ సీజన్లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ సంఖ్య మూడుకు చేరింది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలోనే రెండు సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో మైదానంలో తనదైన బ్యాటింగ్‌తో రారాజుగా వెలిగిన కోహ్లీ.. ఇప్పుడు పేలవ ప్రదర్శనతో సున్నాలకే చుట్టేస్తుండటంతో అతని కెరీర్ చివరి దశకు చేరిందా? అనే సందేహం కలుగుతోంది.

పదేళ్లలో తొలిసారి..
ఐపీఎల్‌లో గత పదేళ్లలో తొలిసారిగా విరాట్ కోహ్లీ సగటు 20కి దిగువకు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 19.6 సగటుతో 216 పరుగులు మాత్రమే చేసాడు. ఇప్పటి వరకు 2009 సీజన్‌లో 27.6 సగటుతో చేసిన 359 పరుగులకే కోహ్లీకి అత్యల్పం. కానీ ఈ సారి కనీసం 300 పరుగులు కూడా చేయలేని స్థితిలో విరాట్ కనిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై హాఫ్ సెంచరీ బాదినా ఆ ఇన్నింగ్స్ గొప్పగా ఏం అనిపించలేదు. 53 బంతుల్లో 58 పరుగులతో జట్టుకు భారమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈ హాఫ్ సెంచరీతో విరాట్ ఫామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ వారి నమ్మకాన్ని విరాట్ వమ్ము చేశాడు.

స్పిన్‌కు విరాట్ విలవిల..
ముఖ్యంగా స్పిన్‌కు విరాట్ విలవిలలాడుతున్నాడు. ఎంతలా అంటే విరాట్ కోహ్లీ రాగానే ప్రత్యర్థి కెప్టెన్లు స్పిన్నర్లను బరిలోకి దించేంత. అది ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవరైనా సరే ధైర్యంగా కెప్టెన్లు స్పిన్నర్లను తీసుకొస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఆదివారం మ్యాచ్‌లో ఇదే చేశాడు. ఫస్ట్ ఓవరే జగదీష సుచిత్‌కు ఇచ్చి ఫలితం రాబట్టాడు. ఒకప్పుడు క్రీజులో విరాట్ ఉన్నాడు జాగ్రత్త అని ప్రతీ కెప్టెన్ తమ ఆటగాళ్లను హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు విరాట్ దారుణ వైఫల్యం కారణంగా అతనికి స్పిన్నర్లతో చెక్ పెడుతున్నారు.

పాత చింకాయ పచ్చడి షాట్లతో...
మారుతున్న కాలానికి అనుగుణంగా విరాట్ కోహ్లీ తన ఆటను మార్చుకోకపోవడంతోనే దారుణంగా విఫలమవుతున్నాడు. ఒకప్పుడు మొబైల్ రంగంలో రారాజుగా నిలిచిన నోకియా.. ఆ తర్వాత కాలానికి తగ్గట్లు అప్‌డేట్ కాలేక కనుమరుగైంది. విరాట్ సైతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. తన అమ్ముల పొదిలో వినూత్న షాట్లను పెట్టుకోవడం లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్, లాఫ్టెడ్ షాట్స్, బ్యాక్ అవే అండ్ కట్, ఫ్రంట్ ఫుట్ షాట్లతో కాలం వెల్లదిస్తున్నాడు.

అప్‌డేటేడ్ షాట్లు ఆడలేక..
కాలానికి అనుగుణంగా మారిన ఆటను కోహ్లీ అందిపుచ్చుకోలేకపోతున్నాడు. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆయుధంగా మారిన స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్ వంటి షాట్లను ఆడటంలో కోహ్లీ తడబడుతున్నాడు. ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్‌లా మైదానం నలుమూలలా ఆడే ప్రయత్నం చేయలేకపోతున్నాడు. ఏబీడీ అండతో కొన్నిసార్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడిన విరాట్.. ఆ తర్వాత వాటిని కొనసాగించలేకపోయాడు. దాంతో విరాట్ స్ట్రాంగ్ జోన్స్‌కు తగ్గట్లు ప్రత్యర్థి కెప్టెన్లు ఫీల్డ్ సెటప్ చేసి పెవిలియన్ చేర్చుతున్నారు. ఐపీఎల్ అయినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అయినా విరాట్ వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే. అతను అప్‌డేటేడ్ షాట్లను ఆడటం కొనసాగిస్తే మళ్లీ మనం కింగ్ కోహ్లీని చూడవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications