ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. మార్క్‌రమ్ ఇచ్చిన క్యాచ్‌ను న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ లాంగాన్‌లో అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో బంతి వేళ్ల మధ్యలో నుంచి నేలను తాకినట్లు రిప్లేలో కనిపించింది. కానీ అంపైర్ మాత్రం మార్క్‌రమ్‌ను ఔట్‌గా ప్రకటించారు.
దాంతో ఈ వికెట్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఔట్ కాదని కొందరంటే.. ఔటేనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రచిన్ రవీంద్ర వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డారిల్ మిచెల్ ముందుకు డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది.
దాంతో ఫీల్డ్ అంపైర్ మూడో అంపైర్ సమీక్ష కోరాడు. రిప్లేలో బంతి వేళ్ల మధ్యలో నుంచి నేలను తాకినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపై నితిన్ మీనన్.. బంతి కింద చేతి వేళ్లు ఉన్నాయని, ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అవాక్కైన మార్క్‌రమ్.. నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్(30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(2/34), కోల్ మెక్‌కాంచీ(2/9), రచిన్ రవీంద్ర(2/29) రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం న్యూజిలాండ్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి 43 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఫిన్ అలెన్(33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. టీమ్ సీఫెర్ట్(33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా ఒక్కడే ఒక వికెట్ తీసాడు. గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టుతో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ ఫైనల్ ఆడనుంది.
