అలనాటి దిగ్గజ క్రికెటర్ల మధ్య జరుగుతున్న వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో నాటకీయ పరిణామాల మధ్య ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఇండియా ఛాంపియన్స్ ఓటమిపాలైంది. అయినా ఈ టోర్నీలో ముందడుగు వేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇండియా ఛాంపియన్స్ టోర్నీలో ముందడుగు వేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఇండియా ఛాంపియన్స్ జట్టులో కీలక ఆటగాళ్లు అయిన పఠాన్ బ్రదర్స్ మైదానంలో గొడవపడ్డారు. దిగ్గజ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. తన అన్న యూసఫ్ పఠాన్‌పై నోరుపారేసుకున్నాడు. రనౌట్ విషయంలో ఈ ఇద్దరి మధ్య వాగ్వదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇండియా ఛాంపియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని ఇర్ఫాన్ పఠాన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేవగా.. సౌతాఫ్రికా ఛాంపియన్ ఫీల్డర్ నేలపాలు చేశాడు.
అయితే అప్పటికే సింగిల్ పూర్తి చేసిన ఇర్ఫాన్ పఠాన్ డబుల్ కోసం ప్రయత్నించాడు. కానీ యూసఫ్ పఠాన్ వద్దని చెప్పడంతో యూటర్న్ తీసుకున్న ఇర్ఫాన్ పఠాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్ పఠాన్.. అన్న అని కూడా చూడకుండా గట్టిగా అరిచాడు. ఈజీగా రెండో పరుగు తీయవచ్చని తిడుతూ క్రీజును వీడాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఛాంపియన్స్ ఓడినా.. సెమీఫైనల్ అర్హత సాధించడంతో ఇర్ఫాన్ పఠాన్ సంతోషంగా కనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన అన్నకు ముద్దు పెట్టి సంబరాలు చేసుకున్నాడు.
ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఇండియా ఛాంపియన్స్ మెరుగైన రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో భారత్‌పై గెలిచిన సౌతాఫ్రికా.. నెట్‌రన్‌రేట్ కారణంగా ఐదో స్థానానికే పరిమితమైంది. జూలై 12న జరిగే సెమీఫైనల్లో ఇండియా ఛాంపియన్స్.. బ్రెట్‌లీ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో తలపడనుంది. జూలై 13న బర్మింగ్‌హామ్ వేదికగా ఫైనల్ జరగనుంది.