
న్యూఢిల్లీ: తన మార్గదర్శకంలో క్రికెటర్‌గా ఎదిగిన ఉమ్రాన్ మాలిక్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సలహా ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి టీమిండియా పిలుపును అందుకున్నాడు. సౌతాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్‌కు పఠాన్ కీలక సలహా ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన పఠాన్.. ఎట్టి పరిస్థితుల్లో బౌలింగ్ వేగం తగ్గించవద్దని మాలిక్‌కు సూచించాడు. ప్రతీ మ్యాచ్ అనంతరం ఏ విషయాల్లో మెరుగవ్వాలనేదానిపై దృష్టి సారించాలని, సచిన్ టెండూల్కర్ ఈ విధానాన్ని పాటించి సక్సెస్ అయ్యాడని చెప్పాడు.

'ఉమ్రాన్ మాలిక్‌కు నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే లైన్ అండ్ లెంగ్త్ మీద దృష్టి పెటడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వేగం తగ్గించవద్దని. అంతేకాకుంగా స్టంప్స్‌కు దగ్గరగా బంతులు వేయమని, హార్డ్ లెంగ్త్ విసరాలని. ప్రతీ మ్యాచ్ తర్వాత అది ఐపీఎల్ కానీ, మరే ఇతర మ్యాచ్ కానీ మనం ఎక్కడా మెరుగవ్వాలనే విషయంపై దృష్టిసారించాలి. క్రికెట్ కెరీర్ ముగిసే వరకు ఈ విధానాన్ని కొనసాగించాలి. సచిన్ ఈ విధానంతోనే గొప్ప క్రికెటర్ అయ్యాడు.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ఘనత కూడా ఉంది. అయితే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమవడంతో ఉమ్రాన్.. పర్పుల్ క్యాప్ దక్కించుకోలేకపోయాడు.