Irfan Pathan: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్లపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై ప్రభావం చూపే జమ్ము కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు.
అతనికి ఓ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇదే విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రస్తావిస్తూ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. 'గత 11 నెలల క్రితం టీమిండియాలో ఉన్న ఆటగాడికి ఈ సారి జట్టులో స్థానం దక్కుతుందని పూర్తి నమ్మాను.'అని ఉమ్రాన్ మాలిక్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు.

సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల కోసం వేర్వేరు జట్లను ప్రకటించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రోహిత్, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ దూరంగా ఉండగా.. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.
వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కశ్మీర్ పేస్ సంచలన ఉమ్రాన్ మాలిక్‌కు ఏ జట్టులోను చోటు దక్కలేదు. భారత్-ఏ జట్టులో కూడా అతన్ని తీసుకోలేదు.
దాంతోనే ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంచలన పేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. ధారళంగా పరుగులివ్వడంతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండ దండలు లేకపోవడం ఉమ్రాన్ మాలిక్‌కు ప్రతికూలంగా మారింది.
గతంలో కూడా ఉమ్రాన్ మాలిక్‌కు ఇర్ఫాన్ పఠాన్ అండగా నిలిచాడు. అత్యంత వేగంగా బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ బెంచ్‌పై కూర్చోబెట్టడాన్ని పఠాన్ తప్పుబట్టాడు. సన్‌రైజర్స్ ఉమ్రాన్ మాలిక్‌ను సరిగ్గా వాడుకోవడం లేదని విమర్శించాడు.