Irfan Pathan: కోహ్లీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ఊహించలేదు

న్యూఢిల్లీ: అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత కెప్టెన్ అనూహ్య నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కొనసాగుతుండటంతో పనిభారం పెరిగిందని చెప్పుకొచ్చిన విరాట్ కోహ్లీ.. వన్డే, టెస్ట్ కెప్టెన్సీపై దృష్టిసారించేందుకు టీ20ల్లో బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇక ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. అయితే విరాట్ కోహ్లీ నిర్ణయం తనకు షాక్ గురిచేసిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కోహ్లీ ఇలాంటి ప్రకటన చేస్తాడని తాను అస్సలు ఊహించలేదని చెప్పాడు.

ప్రపంచకప్ గెలిస్తే..
అయితే టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.'విరాట్ కోహ్లీ ఈ సమయంలో టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు నిర్ణయం తీసుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు టోర్నీలు ముగిసిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిస్తే అప్పుడు ఏం జరుగుతుంది..? విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు. టెస్టు క్రికెట్‌లో మనం అతని సామర్థ్యం ఏంటో చూశాం. నిజమే.. ఐసీసీ టోర్నీల్లో భారత్ జట్టును ఇప్పటి వరకూ అతను విజేతగా నిలపలేకపోయాడు. అయినప్పటికీ.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎవరికీ అంత సులువు కాదు.

అస్సలు ఊహించలేదు..
నా వరకు కోహ్లీ.. టెస్టు కెప్టెన్‌గా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటాడని భావించా. కానీ ఇలా నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. టీ20 కెప్టెన్‌గా కోహ్లీకిది చివరి ప్రపంచకప్.. కాబట్టి టీమిండియా అతని సారథ్యంలో కప్ గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఐదేళ్ల పాటు టీ20 కెప్టెన్‌గా భారత్‌కు విజయాలు అందించాడు. ఒక కెప్టెన్‌గానే గాక ఒక బ్యాట్స్‌మన్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించిన కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకోవడం బాధ కలిగించింది. అయితే కోహ్లీ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు రవిశాస్త్రి, రోహిత్‌లతో సుధీర్ఘ చర్చల అనంతరమే నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా రానున్న రోహిత్ శర్మను తక్కువ చేసి చూడలేం. అతని కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. కోహ్లీ గైర్హాజరీలోనూ రోహిత్ టీమిండియాకు మంచి విజయాలు అందించాడు.'' అని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌కే సారథ్య బాధ్యతలు..
కోహ్లీ ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌లో ముంబైని అయిదుసార్లు విజేతగా నిలపడమే పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లీ అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లీ కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్‌కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్, శ్రేయస్, పంత్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications