
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముంబైలోని వర్సోవా శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఈ అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యారు.
ఇక ఇర్ఫాన్ మృతిపై యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినీ,రాజీకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో లెజండరీ యాక్టర్‌తో తనకున్న బంధాన్ని తెలుపుతూ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ నివాళులర్పించాడు. ప్రజలంతా ఇర్ఫాన్ ఖాన్‌ను ట్యాగ్ చేయబోయి తనకు చేశేవారని, ఆ దిగ్గజ నటుడితో తనకు బంధం అదేనని ఈ మాజీ పేసర్ గుర్తు చేసుకున్నాడు.
'ప్రజలంతా ఇర్ఫాన్ ఖాన్‌ను ట్యాగ్ చేయబోయి నాకు చేశేవారు. ఒక్కసారి కూడా కలవని ఈ దిగ్గజ నటుడితో నాకున్న బంధం ఇదే. భారత సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అద్భుతం. అతని మరణ వార్త బాధను కలిగించింది. ఆయన మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. ఆయన భౌతికంగా దూరమైనా.. ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అల్లాను ప్రార్ధిస్తున్నా'అని పఠాన్ ట్వీట్ చేశాడు.
ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ షమీ, కైఫ్, సురేశ్ రైనా తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. 'ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త బాధను కలిగించింది. ఆయన విలక్షన నటన, టాలెంట్ ప్రతీ ఒక్కరి హృదయాలను తాకింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.
తన అభిమాన నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరని సచిన్ సంతాపం తెలిపారు.'ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త వినడం విచారకరంగా ఉంది. నా అభిమాన నట్టుల్లో ఆయన ఒకరు. ఇర్ఫాన్ చివరగా నటించిన అంగ్రేజి మీడియంతో సహా అన్నీ సినిమాలు చూశాను. ఆయనకు నటన చాలా సహజంగా ఉండేది. టెర్రిఫిక్ యాక్టర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'అని మాస్టర్ ట్వీట్ చేశాడు.