కరోనా కష్టకాలంలో ఇర్ఫాన్ పఠాన్ పెద్ద మనసు!

చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటికే పలు రకాలుగా సాయం చేసిన విషయం తెలిసిందే. మాస్కులు, ఆహారం వంటివి పంపిణీ చేయడమే కాకుండా పలు విరాళాలిచ్చి తన ఔదార్యాన్ని ప్రదర్శించాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక కోబ్లర్ (చెప్పులు కుట్టే వ్యక్తి)కి రూ.25000 ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

చెప్పులు కుట్టే వ్యక్తం సాయం..
చెన్నై చెపాక్ స్టేడియం వద్ద చెప్పులు, షూస్ కుడుతూ, బ్యాట్లకు రిపేర్ చేస్తూ జీవనం సాగించే భాస్కరన్ కొంతకాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు పనిచేస్తున్నాడు. ప్లేయర్ల షూస్ రిపేర్ చేస్తూ ఒక్కో సీజన్‌కు రూ.25వేల దాకా సంపాదించేవాడు. ఈసారి లీగ్ ఇంకా జరగకపోవడం, లాక్‌డౌన్‌తో ఉపాది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. భాస్కరన్ పరిస్థితిపై ఓ వెబ్‌సైట్ లో వచ్చిన కథనం చూసిన ఇర్ఫాన్ అతనికి రూ.25 వేలు పంపించాడు.
ఐపీఎల్ జరగకుంటే కష్టమే..
ఈ విషయాన్ని భాస్కరనే మీడియాకు తెలిపాడు. ‘సీఎస్‌కే ప్లేయర్లు నన్ను బాగా చూసుకుంటారు. ఐపీఎల్ జరిగే సమయంలో మ్యాచ్‌కు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తారు. సీజన్ ముగిసాక అందరూ కలిసి వాటాలు వేసుకొని ఒకేసారి నాకు రూ.25వేలు దాకా ఇచ్చేవారు. దీనికి అదనంగా ధోనీ మరికొంత ఇస్తాడు. ఈ సారి లీగ్ లేకపోవడంతో కష్టాల్లో ఉన్నా. గతవారం ఇర్ఫాన్ నాకు డబ్బు పంపాడు. వాటితో నిత్యావసర సరుకులు కొన్నా. ఇప్పటికే బయట కొంత అప్పు చేశా. ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే నాకు కష్టాలు తప్పవు'అని భాస్కరన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇర్ఫాన్‌పై ప్రశంసలు..
ఇర్ఫాన్ చేసిన సాయంపై అటు క్రికెటర్లు.. ఇటు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో మంచి పనిచేసావ్ భాయ్ అని కొనియాడుతున్నారు. భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా పఠాన్ చేసిన సాయాన్ని ప్రశంసించాడు. ‘కరోనా కష్టకాలంలో అల్లాడుతున్న అభాగ్యులకు అండగ నిలవడం గొప్ప విషయం ఇర్ఫాన్ భాయ్.'అని ట్వీట్ చేశాడు. ఇక ఈ వార్తను ట్వీట్ చేసిన ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ జర్నలిస్ట్‌ను కూడా డీకే కొనియాడాడు. ఈ విపత్కరమైన సమయంలో ఇలా సానుకూల విషయాలను తీసుకురావడం సో స్వీట్ అని సదరు జర్నలిస్ట్‌ను మెచ్చుకున్నాడు.

సెప్టెంబర్‌లో ఐపీఎల్..
ఇక ప్రపంచ క్రికెట్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తుంది. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీ20 ప్రపంచక్‌పపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సందేహం వ్యక్తం చేస్తుండడంతో ఐపీఎల్ నిర్వహణకున్న అడ్డంకులన్నీ తొలగినట్టే కనిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబరులోనే అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఈ ధనాధన్ లీగ్ సిద్ధం కాబోతోంది. ప్రస్తుతానికి సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు విండోను బీసీసీఐ ఖాయం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications