ట్రావిస్ హెడ్‌తో గొడవ.. విరాట్ కోహ్లీదే తప్పు: ఇర్ఫాన్ పఠాన్
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌తో కరచాలనం చేయకపోవడం విరాట్ కోహ్లీ తప్పేనని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. మైదానంలో ఏం జరిగినా మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సంప్రదాయమని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఇలా చేసి ఉండాల్సింది కాదన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్దం నడిచింది. ఒకరికొకరు విమర్శలు గుప్పించుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. విరాట్ కోహ్లీ నిరాకరించాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఇలా చేయాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విరాట్ కోహ్లీదే తప్పు..
కోహ్లీ బాధపడేలా ట్రావిస్ హెడ్ ఏదో అని ఉంటాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తుండగా.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి మైదానంలో ఇలా ప్రవర్తించడం సరికాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారంపై స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ముమ్మాటికి కోహ్లీ తప్పేనని పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లీ ఎప్పుడూ మైదానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల తరహాలోనే పూర్తి దూకుడుతో, భావోద్వేగాలతో, స్లెడ్జింగ్ చేస్తూ ఆడటాన్ని ఇష్టపడతాడు. ఇలాంటి తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌ల్లో.. అది కూడా టాప్-2 ప్లేస్ కోసం జరుగుతున్న పోరులో ఇలాంటి ఘటనలు జరగడం చాలా సహజం.

కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్దం..
సాధారణంగా ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతుంటాడు. కానీ ఈ మ్యాచ్‌లో అతను అలా కాకుండా ఫీల్డింగ్ కూడా చేశాడు. దాంతో కోహ్లీ అతన్ని రెచ్చగొడుతూ.. 'నువ్వేం ఇంపాక్ట్ ప్లేయర్‌వి కావుగా, వచ్చి ఒక రెండు ఓవర్లు బౌలింగ్ వేయ్ చూద్దాం' అని చాలెంజ్ చేసినట్లు అనిపించింది. ఆ తర్వాత కోహ్లీ ఔట్ అయినప్పుడు హెడ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చిన్నట్లున్నాడు. నేను బౌలింగ్‌కు రాకముందే ఔట్ అయ్యావ్ కదా? అని హెడ్ అన్నట్లు తెలుస్తోంది.
అయితే మైదానంలో ఎంత గొడవ జరిగినా.. వాటిని అక్కడే వదిలేయాలి. కానీ పోస్ట్-మ్యాచ్ హ్యాండ్‌షేక్ సమయంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా నిరాకరించడం సరైన పద్ధతి కాదు. కోహ్లీ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనం పాటించాలి.’అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఓడి గెలిచిన ఆర్‌సీబీ..
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడినా పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే వ్యూహం మార్చి రన్‌రేట్ కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో ఓడినా ఆర్‌సీబీ గెలిచనట్లు అయ్యింది. ఆర్‌సీబీతో పాటు గుజరాత్ టైటాన్స్‌తో సమంగా 18 పాయింట్స్ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ రన్‌రేట్ కారణంగా మూడో స్థానానికే పరిమితమైంది.
మే 26న ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. సన్‌రైజర్స్ ఎలిమినేటర్ ప్రత్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ఎలిమినేటర్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

