ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలు.. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రాణించడంపై ఆధారపడి ఉన్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. దూకుడుగా ఆడే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి కీలకమైన అనుసంధానకర్త పాత్ర పోషించగలడని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఆశ్చర్యకరంగా నితీష్ పాత్ర కీలకమని పఠాన్ చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి గతేడాది దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఫామ్ అందుకొని పూర్వవైభవం అందుకోవాలనే పట్టుదలతో ఈ తెలుగు తేజం ఉన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును విశ్లేషించిన ఇర్ఫాన్ పఠాన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నితీష్ కుమార్ రెడ్డి తన ఆల్‌రౌండర్ పాత్రను సరిగ్గా పోషిస్తే.. ఈ అల్ట్రా-అగ్రెసివ్ టీమ్‌ను బ్యాలెన్స్ చేసే వ్యక్తిగా నిలుస్తాడు. గత ఏడాది అతను నిరాశపర్చాడు. 2024లో 300 పైగా పరుగులు చేసి 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డు గెలుచుకున్న నితీష్.. గత ఏడాది కేవలం 182 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 119కి పడిపోయింది. ఈసారి అతను అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటాడో చూడాలి.
ప్యాట్ కమిన్స్ గైర్హాజరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద లోటు. కమిన్స్ నాయకత్వం, బౌలింగ్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చాలా కీలకం. జట్టులో దూకుడును నింపింది ఆయనే. క్లిష్ట సమయాల్లో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసే సీనియర్ ఆటగాడు లేకపోవడం జట్టుపై ప్రభావం చూపుతుంది.
కమిన్స్ గైర్హాజరీలో టీమ్ సారథ్య బాధ్యతలు ఇషాన్ కిషన్ దక్కాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును విజేతగా నిలబెట్టడంతో పాటు టీ20 ప్రపంచకప్ 2026లో మెరుగైన ప్రదర్శన ఇషాన్ కిషన్‌కు కలిసొచ్చే అంశాలు. కెప్టెన్‌గా అభిషేక్ శర్మ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుత ఫామ్, అనుభవం దృష్ట్యా ఇషాన్ కిషన్‌ను కెప్టెన్ చేయడం మంచి నిర్ణయం. అభిషేక్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు.'అని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు.