
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ చెత్త రికార్డు నమోదు చేశాడు. మీడియం పేసర్ అయిన మార్క్ రిచర్డ్ అడైర్ ఒకే ఓవర్‌లో ఐదు వైడ్లతో ఏకంగా 11 బంతులేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌కార్తీ తన సూపర్ ఫీల్డింగ్ విన్యాసంతో సిక్సర్ కాస్త డబల్‌గా మార్చడంతో అడైర్ మరో చెత్త రికార్డును తప్పించుకున్నాడు. లేకుంటే ఒకే ఓవర్‌లో 30 పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలోకి అడైర్ కూడా ఎక్కేవాడు. ఈ మెగా టోర్నీలో ఒకే ఓవర్‌లో అత్యధిక వైడ్లు వేసిన బౌలర్‌గా పరుగులిచ్చిన ప్లేయర్‌గా అడైర్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ తొలి బంతినే స్టోయినీస్ బౌండరీ బాదగా.. ఒత్తిడికి గురైన అడైర్ రెండో బంతిని వైడ్‌గా వేసాడు. ఇక మూడో బంతిని స్టోయినిస్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో మెక్‌కార్తీ అసాధారణ ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను కాస్త డబుల్‌గా మార్చాడు. ఆ తర్వాతి బంతి బౌండరీ బాదిన స్టోయినీస్.. నాలుగో బంతిని సింగిల్ తీసాడు. అనంతరం వరుసగా మూడు వైడ్లు వేయగా.. ఫించ్ ఐదో బంతిని బౌండరీ బాదాడు. అనంతరం మరో వైడ్ వేసిన అడైర్... చివరి బంతికి సిక్స్‌ను సమర్పించుకున్నాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్(3) వికెట్ కోల్పోయినా.. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్(28)తో కలిసి కెప్టెన్ ఆరోన్ ఫించ్(44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించిన అనంతరం మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్(13) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. మార్కస్ స్టోయినిస్ ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు. ఫించ్, స్టోయినిస్ ఓవర్ వ్యవధిలోనే వెనుదిరిగారు. చివరి ఓవర్‌లో అడైర్ 17 పరుగులు ఇవ్వడంతో ఆసీస్ 179 పరుగులు చేయగలిగింది. అడైర్ ఒక్కడే 59 పరుగులిచ్చాడు.