
డబ్లిన్: ఐర్లాండ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డబ్లిన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్.. చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. పసికూన ఐర్లాండ్ అద్భుత ప్రదర్శన ముందు కివీస్ తేలిపోయింది. చివరకు ఆ జట్టు ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్ వెల్(82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 127 నాటౌట్) అజేయ శతకంతో ఓటమి నుంచి గట్టెక్కింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 300 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్(117 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113) సెంచరీ చేయగా.. కర్టిస్ కాంఫెర్(43) అతనికి అండగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్, టిక్నర్, ఇష్ సోదీ రెండేసి వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్.. మార్టిన్ గప్టిల్(61 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యాడు. దాంతో ఓ దశలో కివీస్ 153 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఘోర పరాభావం తప్పదని అంతా భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ఇష్ సోదీ(25)తో కలిసి ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించిన మైకేల్.. అనంతరం టెయిలండర్లతో ఒంటరి పోరాటం చేశాడు.
తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న అతను క్రైగ్ యంగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 4,4,6,4,6 ఐదు బౌండరీలు బాది మరో బంతి మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో కాంఫెర్ మూడు వికెట్లు తీయగా.. మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరగనుంది.