
బెల్ఫాస్ట్: ఐర్లాండ్ క్రికెట్ జట్టు సంచలన విజయాన్నందుకుంది. తమ కంటే మెరుగైన అఫ్గానిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి టీ20లో 7 వికెట్లతో అఫ్గాన్‌పై గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఉస్మాన్ ఘణి(42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇబ్రహిమ్ జడ్రాన్(18 బంతుల్లో ఫోర్, 2సిక్స్‌లతో 29 నాటౌట్) వేగంగా ఆడాడు. స్టార్ ఆల్‌రౌండర్లు రషీద్ ఖాన్(2), కెప్టెన్ మహమ్మద్ నబీ(5) దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ మూడు వికెట్లు తీయగా.. డాక్‌రెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. కెప్టెన్ ఆండ్రూ బాల్‌బిర్నీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51), లోర్కాన్ టక్కర్(కీపర్)(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. హర్రీ టెక్టర్(25 నాటౌట్), జార్జ్ డాక్‌రెల్(10 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

ఒపెనర్ పాల్ స్టిర్లింగ్(31) శుభారంభం అందించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు. నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం జరగనుంది.