
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఈ మెగాటోర్నీని రద్దు చేయడమే ఉత్తమమనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 8 జట్ల పెద్దలు సోమవారం సాయంత్రం 6 గంటలకు కాన్పరెన్స్ కాల్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఓ ఫ్రాంచైజీ అధికారే మీడియాకు తెలిపారు.
'సోమవారం సాయంత్రం మాకు కాన్ఫరెన్స్ సమావేశం ఉంది. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నాం. స్కూల్స్, కాలేజీలు, థియేటర్స్, మాల్స్ అన్నీ బందయ్యాయి. ఆరోగ్య శాఖ ఆదేశాలతో ఆఖరికి జిమ్‌లు కూడా తెరవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సీజన్ ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.'అని సదరు అధికారి తెలిపారు.
ఇక బీసీసీఐతో జరిగిన సమావేశంలో అన్నిటి కన్నా భద్రతనే ముఖ్యమని తాము(ఫ్రాంచైజీలు) అందరం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని మరో అధికారి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ రద్దయ్యే అవకాశం ఉందని, ఫ్రాంచైజీలకు నష్టాలు తప్పవని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపారు.
'ఫ్రాంచైజీలు ప్రాథమికంగా రూ. 15-20 కోట్లు నష్టపోవచ్చు. జీతాలు, ఆర్గనైజర్స్ వల్ల ఈ నష్టాలు తప్పవు. ఇక టిక్కెట్ల అమ్మకాలు జరిపినప్పుడు టోర్నీ జరగకపోతే అవి కూడా భరించాల్సి ఉంటుంది. కానీ, మానవ భద్రతను మించింది ఏది లేదనే విషయాన్ని మనం గర్తించాలి.'అని ఆ అధికారి తెలిపారు.
ఇక ఫారిన్ ప్లేయర్లను భారత ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినా.. ఆయా దేశాల బోర్డులు అనుమతివ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరగాలని అన్ని ఫ్రాంచైజీలు కొరుకుంటున్నా.. నెలాఖరులో ఏం జరుగుతుందో తెలియదని, పరిస్థితులపైనే ఇది ఆధారపడి ఉందన్నారు.