
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు(సోమవారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. కోల్‌కతా జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
రెగ్యులర్ టెస్ట్‌ల్లో భాగంగా చేసిన పరీక్షల్లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు పాజిటీవ్ అని తేలిందని, ఈ ఇద్దరిని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపింది. వారిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. ఇక కేకేఆర్ టీమ్‌లో ఆటగాళ్లందరికి మరొకసారి పరీక్షలు నిర్వహిస్తామని, ఇంకెవరికైనా కరోనా సోకిందా? అనే విషయాన్ని గుర్తిస్తామని స్పష్టం చేసింది. మెడికల్ టీమ్ కూడా ఈ ఇద్దరికి సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లను సైతం గుర్తించి పర్యవేక్షిస్తుందని పేర్కొంది. లీగ్‌లో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ, కోల్‌కతా నైట్‌రైడర్స్ కావాల్సి చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టం చేసింది. అయితే వాయిదా వేసిన మ్యాచ్‌నూ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
వరుణ్ చక్రవర్తీ, సందీప్ వారియర్ మినహా మిగతా ఆటగాళ్లందరికి కరోనా నెగటీవ్ వచ్చింది. ముందు జాగ్రత్తగా ఆటగాళ్లందరికి మరోసారి పరీక్షలు చేయనున్నారు.