టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. అతని వారుసుడిగా టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ తమ కథనంలో పేర్కొంది.
టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జైషా గౌతమ్ గంభీర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఓ ఐపీఎల్ ఓనర్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు అయ్యిందని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ తెలిపాడు.

టీమిండియా హెడ్ కోచ్ పదవి దరఖాస్తులకు విధించిన గడువు సోమవారంతో ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మొత్తం 3 వేల అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా వరకు ఫేక్ అప్లికేషన్స్ ఉన్నట్లు సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీల పేరిట దరఖాస్తు చేసినట్లు ఓ జాతీయా ఛానెల్ పేర్కొంది.
సంప్రదాయం ప్రకారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ దరఖాస్తులను పరిశీలించి కొందర్నీ షార్ట్ లిస్ట్ చేస్తోంది. షార్ట్ లిస్ట్ చేసిన వారిని బీసీసీఐ నియమించే ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక విషయంలో ఈ కమిటీనే తుది నిర్ణయం తీసుకుంటుంది.
అయితే దేశవాళీ క్రికెట్‌పై లోతైన అవగాహన ఉన్న వ్యక్తినే టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఛాంపియన్‌గా నిలవడంలో మెంటార్‌గా గంభీర్‌ది కీలక పాత్ర.
మరోవైపు ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు ఇతర మాజీ క్రికెటర్లు టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతో గంభీర్‌కు పోటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్‌ను కేకేఆర్ వదులుకుంటుందా? లేదా? అనేది చూడాలి. కానీ గంభీర్ ఫ్రాంచైజీ క్రికెట్ కంటే అంతర్జాతీయ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.
ఇక కోచ్‌గా గంభీర్‌కు ఎలాంటి అనుభవం లేదు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, తాజా సీజన్‌లో కేకేఆర్‌కు అతను మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే ఈ రెండు సీజన్లలో ఆయా జట్లు నాకౌట్ చేరాయి. ఒకవేళ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైతే 2027 వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.