ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షప్రభావ పరిస్థితులతోనే బౌలింగ్ ఎంచుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో ఈ మ్యాచ్ 2.30 గంటలు ఆలస్యంగా మొదలైంది. అంపైర్లు మ్యాచ్ 11 ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే 3.2 ఓవర్ల పాటు ఉండనుంది.
టాస్ గెలిచిన అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. వర్షం ప్రభావిత మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ కవర్ల కింద ఉంది. వర్షం ప్రభావిత మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. దానివల్ల ఎంత స్కోర్ ఛేజ్ చేయాలనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. వర్షం ముప్పు, ఓవర్లు తగ్గడంతోనే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాను.

గత మ్యాచ్ ఓటమిపై బాధపడాల్సిన అవసరం లేదు. ఇది సీజన్ ఆరంభం మాత్రమే. కొన్ని తప్పులు జరగడం సహజం. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీ. తొలి రెండు వారాల్లోనే ఐపీఎల్ గెలవలేం. అలాగని ఓడిపోం కూడా. మా తప్పిదాలను మేం చర్చించుకున్నాం. ఏ విషయాల్లో మెరుగుపడాలో మాట్లాడుకున్నాం. ఇది తక్కువ సమయంలో జరుగుతున్న తదుపరి మ్యాచ్. కాబట్టి ప్రణాళికలను అమలు చేయడంపైనే ఫోకస్ పెట్టాం. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. నాతో పాటు ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. 'నిజానికి మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ కొంచెం పొడిగా ఉంటుందని భావించాం. కానీ భారీ వర్షం కారణంగా ప్రస్తుతం పిచ్‌లో కొంత తేమ ఉంది. ఇది 11 ఓవర్ల మ్యాచ్ కాబట్టి తేమ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేం రెండు వేర్వేరు రకాల మ్యాచ్‌లు ఆడాం. ఒకటి మమ్మల్ని తీవ్రంగా సవాలు చేసింది. మరొకటి మొదటి నుంచి చివరి వరకు మమ్మల్ని పైచేయి సాధించేలా చేసింది. ఒత్తిడిలో కుర్రాళ్లు రాణించిన తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు కూడా అదే ఫలితాన్ని ఆశిస్తున్నా. మేం విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఎ.ఎమ్. గజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.