
హైదరాబాద్: పరిస్థితులకు అర్థం చేసుకుని ఆడేందుకే తాను ప్రయత్నిస్తానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ 'పరిస్థితులకు అర్థం చేసుకుని ఆడేందుకే నేను ప్రయత్నిస్తా. నాకు అలా ఆడటమే ఇష్టం. అంతే కానీ గేల్, డివిలియర్స్‌లా ప్రతి బంతిని హిట్ చేయాలని అనుకోను. నా శైలిలోనే ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటాను' అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.
'చివరి వరకు ఆసక్తిగా సాగే మ్యాచ్‌లు కచ్చితంగా సవాల్‌తో కూడుకున్నవే. ఇలాంటి సమయంలో సహచర ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ కెప్టెన్‌గా నా బాధ్యత నేను నిర్వహిస్తా' అని విలియమ్సన్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీంతో డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌కు దూరం కావడంతో ఆ జట్టు యాజమాన్యం కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ 11వ సీజన్‌లో ఉన్న ఎనిమిది జట్ల కెప్టెన్లలో కేన్ విలియమ్సన్ ఒక్కడే విదేశీ కెప్టెన్ కావడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 230 పరుగులు సాధించాడు.
మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో విలియమ్సన్ మరో 10 పరుగులు సాధిస్తే చాలు ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు సంజూ శాంసన్ 239 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండటంతో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.