చాలా అన్యాయం.. కోట్లు పెట్టాం! బీసీసీఐ నిర్ణయం సరైంది కాదు.. ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆవేదన!

న్యూఢిల్లీ: విదేశీ లీగ్స్‌లో భారత ఆటగాళ్లను అనుమతించేది లేదని, ఎవరైనా బోర్డు నిబంధనలు పాటించాల్సిందేనని బీసీసీఐ తేల్చి చెప్పడంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది చాలా అన్యాయమని, ఆటగాళ్లపై కోట్లు పెట్టామని, ఇలాంటి నిర్ణయాలతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. యూఏఈ, సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్స్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం 6 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేసాయి.

ధోనీ కోసం సీఎస్‌కే..
ముంబై ఇండియన్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా లీగ్‌లో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తమ ఐపీఎల్ ఆటగాళ్లను అక్కడ ఆడించాలనుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తమ జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ టీమ్‌కు మెంటార్‌గా నియమించాలనుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రం ఆడుతుండటంతో అతనికి ఇతర ఆటగాళ్ల నుంచి మినహాయింపు లభిస్తుందని సీఎస్‌కే యాజమాన్యం భావించింది. కానీ బీసీసీఐ మాత్రం ఆ ఫ్రాంచైజీకి షాకిచ్చింది.

ఎవ్వడైనా రూల్స్ పాంటించాల్సిందే..
భారత ఆటగాళ్లు విదేశీ లీగ్స్ ఆడే విషయంలో తమ నిర్ణయం మారదని బీసీసీఐ స్పష్టం చేసింది. విదేశీ లీగ్స్ ఆడాలనుకుంటే భారత్ క్రికెట్‌తో తెగతెంపులు చేసుకోవాలని, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని సూచించింది. ఎంతటి పెద్ద ఆటగాడికైనా ఈ నిబంధన వర్తిస్తుందని పరోక్షంగా ధోనీని ఉద్దేశించి పేర్కొంది. వచ్చే సీజన్‌లో చెన్నైలో మ్యాచులు ఆడిన తర్వాతే ఐపీఎల్ నుంచి తప్పుకుంటానని ధోనీ ప్రకటించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలంటే మాహీ, ఐపీఎల్‌కి దూరం కావాల్సి ఉంటుంది.

ఫ్రాంచైజీల గగ్గోలు..
ఆటగాళ్ల విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఫ్రాంచైజీలు అంటున్నాయి. ఇది అశాస్త్రీయమైన నిర్ణయమని ధ్వజమెత్తాయి. 'ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మీడియాలో వస్తున్న కథనాలను మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ అవి నిజమైతే బోర్డు నిర్ణయం చాలా అన్యాయమైంది. ఎందుకంటే మాకు అందుబాటులో ఉన్న వనరులకు మేం ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు మాకు ఉంటుంది. ఒకవేళ బీసీసీఐ ఇది అన్యాయమని భావిస్తే దానికి సరైన కారణాలు చెప్పాలి. భారత్‌లోనూ, ఫారిన్ లీగ్‌ల్లో పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ప్లేయర్లను తీసుకుంటున్నాం. వాళ్లను ఎక్కడైనా ఉపయోగించుకునే చాన్స్ మాకు ఇవ్వాలి. లేకపోతే మేం చాలా నష్టపోతాం'అని ఓ ఫ్రాంచైజీ అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications