హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కనుమరుగవుతుందా? ఫ్రాంచైజీ క్రికెట్ రాజ్యమేలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అతికొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు శుభం కార్డు వేసి ఫ్రాంచైజీ క్రికెట్‌ను విస్తరించేందుకు కార్పోరేట్ సంస్థలు కాచుకు కూర్చున్నాయి. నష్టం లేని వ్యాపారం కావడంతో దిగ్గజ వ్యాపార సంస్థలన్నీ క్రికెట్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రజల బలహీనతను క్యాష్ చేసుకొని కోట్లు సంపాదించాలనుకుంటున్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో బీసీసీఐ కోట్లు ఆర్జిస్తుండటంతో అందరి కన్ను ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్‌పై పడింది. ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌ల్లోనూ భాగమయ్యాయి. సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాదే ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 6 జట్లకు 6 జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీ లీగ్సే కొనుగోలు చేశాయి. యూఏఈ లీగ్స్, కరేబియన్ లీగ్స్‌లోనూ భాగమయ్యాయి.

రాబోయే మేజర్ లీగ్ టీ20 (అమెరికా)లోనూ భాగం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా లీగ్‌ల్లోని తమ జట్ల తరపున ఆడేందుకు అంతర్జాతీయ ఆటగాళ్ల కోసం గాలం వేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి, ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఉన్న తమ జట్ల తరపున ఆడేలా ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లతోనూ ఫ్రాంఛైజీలు చర్చించినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు ఆయా ఆటగాళ్లతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని, అందుకు గాను దాదాపు రూ.50 కోట్ల వరకూ చెల్లించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్ట్ అంటే చాలా మంది ఆటగాళ్లు తమ దేశ కాంట్రాక్టులను వదులుకొని ఫ్రాంచైజీ లీగ్స్ ఆడనున్నారు.
ఇప్పటికే వెస్టిండీస్ ఆటగాళ్లు తమ జాతీయ జట్టుకు ఆడటం కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు గనుక రూ.50 కోట్ల ఆఫర్ ఇస్తే.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు క్యూ కడుతారని, అవసరమైతే తమ దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించి వస్తారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది క్రికెట్ మనుగడకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఐసీసీ వెంటనే జోక్యం చేసుకొని ఫ్రాంచైజీ లీగ్స్ విస్తరణను అడ్డుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించడంపై సమాలోచనలు చేస్తోంది. కేవలం ఐసీసీ టోర్నీలు మాత్రమే నిర్వహించి.. ద్వైపాక్షి సిరీస్‌లు రద్దు చేయాలని కొంత మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఫుట్‌బాల్ లీగ్స్ తరహాలో ప్రపంచకప్‌లు మాత్రమే నిర్వహించి.. ఫ్రాంచైజీ లీగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు.