ఐపీఎల్ స్వాప్ డీల్.. ఢిల్లీకి రిషభ్ పంత్! సగం ధర తగ్గించుకోని..!
ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మెగా స్వాప్ డీల్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ ఆ జట్టును వీడి తన పాత టీమ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.
రిషభ్ పంత్‌కు బదులుగా కుల్దీప్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. ఈ మెగా స్వాప్ డీల్‌కు సంబంధించిన వివరాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
రూ.15 కోట్లతోనే..
'ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లకు సంబంధించిన స్వాపింగ్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తయ్యింది. రూ.15 కోట్ల ధరతోనే ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రిషభ్ పంత్ సిద్దమవ్వగా.. రూ.13.5 కోట్ల ప్రైజ్ ట్యాగ్‌తో కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులో చేరనున్నాడు.'అని ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతని సారథ్యంలో వరుసగా రెండు సీజన్లు ఆడిన లక్నోసూపర్ జెయింట్స్ దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దాంతో రిషభ్ పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి లక్నో తప్పించింది. రిషభ్ పంతే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ప్రకటించింది.
లక్నో టీమ్‌తో విభేదాలు..?
సీజన్ ఆరంభంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా రిషభ్ పంత్‌ను మందలించడం కూడా కనిపించింది. ఆ జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాలు తలెత్తడంతోనే పంత్ తిరిగి ఢిల్లీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. తన పాత ఫ్రాంచైజీలోకి తిరిగి వెళ్లేందుకు పంత్ తన ధరను ఏకంగా రూ.12 కోట్లు తగ్గించుకున్నాడు. 2016 నుంచి 2024 వరకు రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు.
ఆ టీమ్ తరఫున 111 మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అతను రికార్డు సాధించాడు. 2021-2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరించాడు. రిషభ్ పంత్ రీఎంట్రీని ఢిల్లీ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు.
మరోవైపు 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన కుల్దీప్ యాదవ్ 65 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. రూ.13.50 కోట్ల భారీ ధరతో అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత విలువైన స్వాప్ డీల్ అని నిర్వాహకులు ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications