
బెంగళూరు: రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి అంతరాయం ఏర్పడింది. ఉన్నట్టుండి ఆక్షనర్(వేలం నిర్వహించే వ్యక్తి) హగ్ హెడ్మెడెస్ కుప్పకూలాడు. శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా కోసం బిడ్డింగ్ జరుగుతుండగా.. ఆక్షనర్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అతను పడటానికి గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కాకపోతే గుండెపోటు వచ్చిందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వానిందు హసరంగా కోసం ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుండగా ఆక్షనర్ కిందపడిపోయాడు. ఈ అనుహ్య ఘటనతో మెగా ఆక్షన్ హాల్‌లో ఉన్నవారంత ఉలిక్కిపడ్డారు. అయితే ఆక్షనర్ కిందపడిపోవడంతో మెగా ఆక్షన్‌ను తాత్కలికంగా నిలిపివేసారు. ఇక ఆక్షనర్‌కు ఏం కాలేదని, అతను బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. 3.30 గంటలకు మళ్లీ ఆక్షన్ తిరిగి ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఇక వేలంలో శిఖర్ ధావన్‌ను రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్, రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 7.25 కోట్లకు, కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లకు, శ్రేయస్ అయ్యర్ రూ. 12.25 కోట్లకు కేకేఆర్, ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8 కోట్లకు, మహమ్మద్ షమీ రూ. 6.25 కోట్లు గుజరాత్ టైటాన్స్‌కు ఫాఫ్ డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు, క్వింటన్ డికాక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది.దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.25 కోట్లకు, జాసన్ రాయ్ రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్, హెట్‌మైర్(రూ.8.25) రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.