ఐపీఎల్ 2026 మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి జాక్‌పాట్ తగిలింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ ఆక్షన్‌లో రూ.23.75 కోట్ల ఆటగాడిని ఆర్‌సీబీ రూ.7 కోట్లకే కొనుగోలు చేసింది.అతను ఎవరో కాదు టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యార్. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వెకంటేశ్ అయ్యర్‌ను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో పాటు ఆర్‌సీబీ పోటీపడింది. ముందుగా లక్నో బిడ్ వేయగా.. ఆ తర్వాత గుజరాత్ పోటీలోకి వచ్చింది.
కేకేఆర్, ఆర్‌సీబీ ఎంట్రీ ఇవ్వడంతో గుజరాత్, లక్నో తప్పుకున్నాయి. చివరకు ఆర్‌సీబీ రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలోనూ వెంకటేశ్ అయ్యర్ కోసం ఆర్‌సీబీ, కేకేఆర్ చివరకు పోటీపడ్డాయి. ఆఖరికి కేకేఆర్ రూ.23.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. కానీ అతను తీవ్రంగా నిరాశపర్చాడు. 11 మ్యాచ్‌లు ఆడి 142 పరుగులే చేయడంతో కేకేఆర్ అతన్ని వేలంలోకి వదిలేసింది.

తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని భావించిన కేకేఆర్ వ్యూహానికి ఆర్‌సీబీ దెబ్బకొట్టింది. గత సీజన్‌లో చేజారిన వెంకటేశ్ అయ్యర్‌ను ఈసారి సొంతం చేసుకుంది. రూ.16.4 కోట్ల పర్స్ వాల్యూతో ఐపీఎల్ 2026 వేలంలోకి అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. వెంకటేశ్ అయ్యర్ కోసమే రూ.7 కోట్లు ఖర్చు చేసింది. మిగతా రూ.9.4 కోట్లతో 8 మంది ఆటగాళ్లను ఆర్‌సీబీ కొనుగోలు చేయాల్సి ఉంది.
వెంకటేశ్ అయ్యర్‌ను కొనుగోలు చేయడంపై ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ సంతోషం వ్యక్తం చేశాడు. గతేడాది కూడా అతని కోసం తాము ప్రయత్నించామని గుర్తు చేశాడు. ఈ సారి అతను మా జట్టులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. అతనికి సారథ్య లక్షణాలు ఉన్నాయని, జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉపయోగపడుతాడని పరోక్షంగా వెల్లడించాడు. వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడు.