ఐపీఎల్ 2026 మినీ వేలంలో అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ.25.20 కోట్ల రికార్డ్ ధర పలికాడు. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
రాజస్థాన్ రాయల్స్ మధ్యలోనే తప్పుకోగా.. సీఎస్‌కే, కేకేఆర్ నువ్వా-నేనా అన్నట్లు బిడ్ వేసాయి. చివరకు సీఎస్‌కే ఈ బిడ్ వార్ నుంచి తప్పుకోవడంతో కామెరూన్ గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కామెరూన్ గ్రీన్ నిలిచాడు. ఈ క్రమంలో అతను మిచెల్ స్టార్క్ రికార్డ్‌ను అధిగమించాడు. ఐపీఎల్ 2024 మినీవేలంలో స్కార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
సీఎస్‌కే వెనుకడుగు వేయడంతో ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యధికర ధర రిషభ్ పంత్(రూ.27 కోట్లు)రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది. వేలంలో రూ. 25.20 కోట్లు పలికినా కామెరూన్ గ్రీన్‌కు రూ.18 కోట్లు మాత్రమే దక్కనున్నాయి. మిగతా రూ.7.20 కోట్ల బీసీసీఐ ఖాతాలో చేరుతాయి. విదేశీ ఆటగాడికి ఎవరికైనా గరిష్టంగా రూ. 18 కోట్లు మాత్రమే దక్కేలా బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది.

మెగా వేలంలో గరిష్టంగా రిటెన్షన్ విలువను మాత్రమే అందజేయాలని నిర్ణయించింది. వేలంలో అంతకంటే ఎక్కువ వచ్చినా మిగిలిన మొత్తం బీసీసీఐకి వెళ్లేలా రూల్ తీసుకొచ్చింది. కొందరు విదేశీ ఆటగాళ్లు తెలివిగా మినీ వేలం బరిలో నిలిచి భారత ఆటగాళ్ల కంటే ఎక్కువ ధరను సొంతం చేసుకోవడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌తో వేలం ప్రారంభం కాగా అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. డేవిడ్ మిల్లర్‌ను రూ. 2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చి పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఒక్క ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ కలిగిన డెవాన్ కాన్వే కూడా అన్‌సోల్డ్‌గా నిలిచాడు. ఫ్రాంచైజీల కోరిక మేరకు ఈ ఆటగాళ్లను మళ్లీ వేలం వేసే అవకాశం కూడా ఉంది.