ఐపీఎల్ 2025 మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. అందరూ ఊహించినట్లుగానే ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. పలు ఫ్రాంచైజీల ఓనర్లు ప్రత్యర్థి జట్ల బలహీనతలపై దెబ్బకొడుతూ.. వేలంలో దూకుడు కనబర్చాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ చాలా చురుకుగా వ్యవహరించింది. ఉద్దేశపూర్వకంగానే బిడ్ వేస్తూ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధర ఖర్చు చేసేలా వ్యవహరించింది.
ముఖ్యంగా రిషభ్ పంత్ విషయంలో కావ్య పాప తెలివిగా వ్యవహరించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ఎలాగైనా కొనుగోలు చేస్తుందని భావించిన సన్‌రైజర్స్ ఉద్దేశపూర్వకంగానే బిడ్ వేస్తూ ధరను పెంచింది. పంత్ కోసం రూ.12 కోట్ల వరకు బిడ్ వేసిన ఆర్‌సీబీ ఆ తర్వాత తప్పుకోగా.. సన్‌రైజర్స్ ఎంట్రీ ఇచ్చింది. రూ. 20 కోట్ల వరకు బిడ్ వేసింది. ఆ తర్వాత లక్నో రూ. 20.75 కోట్లకు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లక్నో అమాంతం పంత్ ధరను రూ. 27 కోట్లకు పెంచి సొంతం చేసుకుంది.

అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ కోసం కూడా కావ్య మారన్ ఇలానే దూకుడుగా బిడ్ వేసింది. పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ముందుగానే తీసుకుంటారని గ్రహించి రూ. 18 కోట్ల వరకు వేలం వేసింది. చివరకు పంజాబ్ ఆర్‌టీఎమ్ ద్వారా ఆ ధరకు సొంతం చేసుకుంది. మెగా వేలంలో కావ్య మారన్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
తాజా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమీ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ప్యాట్ కమిన్స్‌కు తోడుగా సీనియర్ ఇండియన్ పేసర్‌ను కొనుగోలు చేయడం మంచి ఆప్షన్ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిట్‌నెస్ సమస్యలు లేకుండా షమీ అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటే.. జట్టుకు మేలు జరగనుంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు అతను మంచి రిప్లేస్‌మెంట్ అవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
IPL 2025 మెగా వేలం హైలైట్స్
అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)
కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)
మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)
డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)
యుజ్వేంద్ర చాహల్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్)
లియామ్ లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్‌సీబీ)
కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)