ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో స్టార్క్ రూ. 24.75 కోట్లు పలికాడు.
8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మిచెల్ స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో అతని ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టార్క్ కోసం కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.

మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తప్పుకున్నా.. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు రూ. 24.75 కోట్ల భారీ ధరకు స్టార్క్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. 2017లో చివరిసారిగా ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్ ఆడిన మిచెల్ స్టార్క్.. ఆ తర్వాత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.
వచ్చే ఏడా టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న నేపథ్యంలో స్టార్క్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2017 వరకు రూ. 5 కోట్ల ధరనే పలికిన స్టార్క్.. ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ ధరను సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ తరఫున స్టార్క్ అన్ని మ్యాచ్‌లు ఆడితే.. అతను ఒక్క ఓవర్‌కు రూ. 45 లక్షలు, ఒక్కో బంతికి రూ. 7.5 లక్షలు తీసుకున్నట్లని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 'ఏందిరా అయ్యా ఒక్క బంతికి ఏడున్నర లక్షలా?' పైసలా పెంకాసులా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ అన్నా.. టీమిండియా అన్నా చిన్న చూపు చూసే స్టార్క్‌కు ఇంత ధర పెట్టాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచకప్ విజయం మోజులో ఫ్రాంచైజీలు పడిపోయాయని, అందుకే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లను భారీ ధరలకు కొనుగోలు చేశాయని కామెంట్ చేస్తున్నారు. వారి కంటే భారత యువ ఆటగాళ్లే ఎంతో నమయని కామెంట్ చేస్తున్నారు.
ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అల్జారీ జోసెఫ్‌ను ఆర్‌సీబీ రూ.11.50 కోట్లకు తీసుకోగా.. డారిల్ మిచెల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రపంచకప్‌లో సత్తా చాటిన ఆల్‌రౌండర్లపై ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించాయి.