IPL 2024: వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సిద్దమవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15-19 మధ్య దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2024 మినీ వేలంతో పాటు గతేడాదే మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ మినీ వేలాన్ని కూడా నిర్వహించాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం నిర్వహించి.. ఆ తర్వాత పురుషుల మినీ వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ కార్యవర్గం నిర్ణయించినట్లు సమాచారం.

డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మినీ వేలం జరపాలని, డిసెంబర్ 15-19న ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.
గతేడాది కూడా మినీ వేలాన్ని ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఇస్తాంబుల్‌లో బీసీసీఐ ఏర్పాట్లను కూడా పూర్తిచేసిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఇస్తాంబుల్‌ను కాదని కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 48వేల కోట్లు ఆర్జించి రికార్డు సృష్టించింది.
అమెరికాలో జరిగే నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) తర్వాత అత్యధిక సంప్నమైన లీగ్‌గా ఐపీఎల్ గుర్తింపు పొందింది. దేశానికి ఒక ఫ్రాంచైజీ లీగ్ ఉన్నా బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్నది మాత్రం ఐపీఎల్ మాత్రమే. ఈ క్రమంలోనే ఐపీఎల్ పరిధిని విశ్వవ్యాప్తం చేయడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ వేలాన్ని దుబాయ్‌లో నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచకప్ నిర్వహణ విషయంలో బిజీగా ఉన్న బీసీసీఐ.. మెగా టోర్నీ తర్వాత ఫ్రాంచైజీలకు పూర్తి వివరాలు వెల్లడించడంతో పాటు వేలం రూల్స్, రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను సమర్ఫించేందుకు చివరి తేదీలను ప్రకటించనుంది.
వన్డే వరల్డ్ కప్ పనుల్లో బిజీగా ఉన్న బీసీసీఐ.. మెగా టోర్నీ ముగిశాక పూర్తివివరాలను ఫ్రాంచైజీలతో పంచుకునే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.