IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?
ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించే పనిలో ముంబై ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. కెప్టెన్సీ కోల్పోయినా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యాతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చర్చలు కొనసాగుతున్నాయని, ప్లేయర్‌గా కొనసాగేందుకు అతను సుముఖంగా ఉన్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అప్‌కమింగ్ సీజన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫ్రాంచైజీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ, బుమ్రా..?
ఈ సమావేశంలో ముంబై ఇండియన్స్ ఓనర్స్‌తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ మహేళ జయవర్దనే పాల్గొన్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్‌గా తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లను పరిశీలిస్తున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టులోనే కొనసాగేందుకు సుముఖంగా ఉన్నాడని సమాచారం.

సూర్యను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సుముఖంగా లేదని, ఒక సీజన్ వైఫల్యంతో కీలక ఆటగాళ్లను వదులుకోవడం సరికాదని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మినహా జట్టులో ఎలాంటి మార్పులు లేవని ముంబై ఇండియన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.
హెడ్ కోచ్‌గా జయవర్దనే..
హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే కొనసాగనున్నారు. ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్‌లో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మహేళ జయవర్దనే పదవి కాలాన్ని మూడేళ్లకు పొడిగించారు. ఈ లెక్కన అతని పదవి కాలం.. ఐపీఎల్ 2027 సీజన్ వరకు ఉంది.
అయితే ఐపీఎల్ 2022 తర్వాత ముంబై ఇండియన్స్ ఒక్క టైటిల్ గెలవకపోగా.. ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఈ ఏడాది కూడా ముంబై దారుణంగా విఫలమైంది. వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.
పుకార్లుకు ముంబై చెక్..
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టులో ప్రక్షాళన జరుగుతుందని, కోచ్‌లతో పాటు ఆటగాళ్లను మార్చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ముంబై మేనేజ్‌మెంట్ మాత్రం కెప్టెన్సీ మినహా ఎలాంటి మార్పులు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా జట్టు వీడుతాడని, ట్రేడింగ్ ద్వారా ఇతర జట్లలోకి వెళ్తాడని జోరుగా ప్రచారం సాగింది.
సీఎస్‌కే, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్లు హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. హార్దిక్ పాండ్యాను రిలీజ్ చేయమని, రిటైన్ చేసుకుంటామని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
సరైన డీల్స్ లేకనే..
వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఆయా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవేవీ కూడా అతని అంచనాలకు తగినట్టుగా లేకపోవడం... అదే సమయంలో ప్లేయర్ల స్వాపింగ్ విషయంలో ముంబై ఇండియన్స్ కు ప్రయోజనకరంగా ఉండే ఒప్పందాలు కుదరకపోవడంతో హార్దిక్‌ను జట్టులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే అతనికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశమైతే లేదని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2028 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈసారి భారీ మార్పులు చేసేందుకు ముంబై మేనేజ్‌మెంట్ సుముఖంగా లేదని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

