ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టానని టీమిండియా వెటరన్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. మద్యం సేవించడం కూడా మానేసినట్లు వెల్లడించాడు. గతేడాది తృటిలో చేజారిన ఐపీఎల్ టైటిల్‌ను ఈసారి అందుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పాడు.
ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన యుజ్వేంద్ర చాహల్ మద్యానికి బానిసైనట్లు వార్తలు వచ్చాయి. అతను బాగా తాగి తూగుతూ ఉన్న వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. భారత జట్టుకు ఎప్పుడో దూరమైన చాహల్.. ఐపీఎల్‌లో మాత్రం ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్పిన్నర్‌గా చాహల్ చరిత్రకెక్కాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ కోల్పోయింది. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన చాహల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'నేను మద్యం మానేసి 6 నెలలకు పైగా అవుతుంది. ఇప్పుడు నా వయసు 35 ఏళ్లు. నేను మరింత ఫిట్‌గా ఉంటూ నా జట్టుకు 150 శాతం సహకారం అందించాలనుకుంటున్నా. ఒక సీనియర్ ఆటగాడిగా.. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను.

ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో మార్కో యాన్సెన్ లేకపోవడం మాకు నష్టం కలిగించింది. అతను ఉండి ఉంటే.. మేం కచ్చితంగా టైటిల్ గెలిచేవాళ్లం. టోర్నీ ఆసాంతం అతను బౌలింగ్, బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతని బౌలింగ్‌ను ఆడటం బ్యాటర్లకు కూడా అంత సులువు కాదు. ఇది మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
కేకేఆర్ మ్యాచ్ తర్వాత నన్ను గాయాలు వెంటాడాయి. పక్కటెముకతో పాటు వేలికి గాయమైంది. దాంతో నేను సెమీఫైనల్, ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాను. అందుకే అప్‌కమింగ్ సీజన్‌కు ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను.'అని చాహల్ తెలిపాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన మార్కో యాన్సెన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 కోసం ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీతో పంజాబ్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసి ఒత్తిడి పెంచింది. ఈ ఫైనల్లో చాహల్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిటనే ఉంది. అతను 174 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు తీసాడు.