ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. ముప్పావు వంతు టోర్నీ ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు కూడా రసవత్తరంగా మారింది. ప్రతీ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెపాక్ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అయితే ఈ రోజు(మే 2)తో పాటు మే నెలలో శనివారాల్లో డబుల్ హెడర్లు (రోజుకు రెండు మ్యాచ్‌లు) లేవు. ఈ నెల మొత్తం శనివారాల్లో ఒకే ఒక్క మ్యాచ్ జరగనుంది. ఇది అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా శని, ఆదివారాల్లో డబుల్ హెడర్లు జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ మొత్త శనివారాల్లో డబుల్ హెడర్స్ జరిగాయి.

2024 సీజన్ నుంచి ఐపీఎల్ షెడ్యూల్‌లో డబుల్ హెడర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం మీద 12 రోజులు మాత్రమే డబుల్ హెడర్లు ఉండగా, అందులో ఎనిమిది ఆదివారాల్లో, నాలుగు ఏప్రిల్ నెలలోని శనివారాల్లో షెడ్యూల్ చేశారు. అయితే, లీగ్ దశ ముగిసే మే 24 వరకు అన్ని ఆదివారాల్లో డబుల్ హెడర్లు జరగనున్నాయి.
మే నెలలో శనివారాల్లో డబుల్ హెడర్లు లేకపోవడంపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మే నెలలో ఉండే తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్నం 3:30 గంటల మ్యాచ్‌లు నిర్వహించడం ఆటగాళ్లకు కష్టంగా మారుతోంది. రెండోది, బ్రాడ్‌కాస్టర్లు కూడా రోజుకు ఒకే మ్యాచ్ ఉండటానికే మొగ్గు చూపుతున్నారు.
రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్‌కు వచ్చే వ్యూయర్‌షిప్ మధ్యాహ్న మ్యాచ్‌లకు రావడం లేదు. దాంతో బ్రాడ్‌కాస్టర్స్ కూడా ఈవ్‌నింగ్ మ్యాచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. మే 24న ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగియనుండగా.. మే 26, మే 27, మే 29 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.