ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఓనర్స్ అయిన అంబానీ ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. మైదానంలో బౌండరీ లైన్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సోఫాలో కూర్చొని మ్యాచ్‌లు చూసే వెసులు బాటు ముంబై ఓనర్స్‌కు మాత్రమే ఉంది. మరే ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా అంబానీ ఫ్యామిలీలా మైదానంలో కూర్చొని మ్యాచ్‌లు చూడరు. వీఐపీ బాక్స్‌ల్లో నుంచి ప్రేక్షకులతో కలిసి మ్యాచ్‌లు వీక్షిస్తారు.
కానీ అంబానీ ఫ్యామిలీకి మాత్రం ప్రతీ ఐపీఎల్ మ్యాచ్‌కు మైదానంలోని బౌండరీ లైన్ వద్ద బ్లూ కలర్ సోఫాను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు ముంబై ఇండియన్స్ ఓనర్స్‌కు మాత్రమే ఎందుకు? అనే సందేహం చాలా మంది అభిమానులకు కలుగుతోంది. ముంబై ఇండియన్స్‌పై బీసీసీఐకి ఉన్న ప్రేమతోనే ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు అని భావించేవారు ఉన్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సోఫా ఏర్పాటుకు గల స్పష్టమైన కారణాన్ని అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

బీసీసీఐ రూల్స్ ప్రకారం ఐపీఎల్ జట్ల యజమానులు తమ హోమ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం అభ్యర్థన మేరకు మ్యాచ్ నిర్వహణకు లేదా ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి ఆటంకం కలగనంత వరకు ఇలాంటి ఏర్పాట్లకు బోర్డు అనుమతిస్తుంది. ఇది కేవలం ముంబైకే కాదు.. ఇతర జట్ల యజమానులకు కూడా వర్తిస్తుంది. కానీ ఇతర జట్ల ఓనర్లు.. వీఐపీ బాక్స్‌ల్లో లేదా స్టాండ్స్‌లో కూర్చోవడానికే మొగ్గు చూపుతారు.
ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద గ్లామర్ ఈవెంట్. యజమానులు మైదానానికి అంత దగ్గరగా కూర్చోవడం వల్ల కెమెరా అటెన్షన్ పొందవచ్చు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నప్పుడు కెమెరాలు తరచుగా యజమానుల వైపు తిరుగుతుంటాయి. దీనివల్ల బ్రాండ్ విజిబిలిటీ పెరుగుతుంది. ఆటగాళ్లకు చాలా దగ్గరగా ఉంటూ వారిని ఉత్సాహపరచడానికి ఇది ఒక మార్గమని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తుంది.
సాధారణంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ ప్రత్యేక సోఫా సెట్టింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. తమ సొంత మైదానంలో హోస్ట్ హోదాలో వారు కోరుకున్న చోట సీటింగ్ ఏర్పాటు చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇతర మైదానాల్లో కూడా కొన్నిసార్లు ప్రత్యేక అనుమతులతో ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటారు.
ప్రపంచంలోనే సంపన్న కుటుంబమైన అంబానీ కుటుంబానికి ఉండే అత్యున్నత స్థాయి భద్రత (Z+ Security) కూడా ఈ ప్రత్యేకమైన సోఫా ఏర్పాటుకు ఓ కారణం. జనంలో కలిసిపోకుండా, సురక్షితంగా ఉంటూనే మ్యాచ్‌ను వీక్షించేలా ఈ ఏర్పాట్లు చేస్తారు. అలాగే, ఎన్.బి.ఏ (NBA) వంటి అంతర్జాతీయ క్రీడల్లో 'కోర్ట్‌సైడ్ సీటింగ్' ఎలా ఉంటుందో, అదే తరహాలో లగ్జరీ, గ్లామర్‌ను ఐపీఎల్‌కు జోడించడం కూడా ఈ ప్రత్యేక వెసులుబాటు ఉద్దేశ్యం. అందరూ అనుకున్నట్లుగా ఈ సోఫా ఏర్పాటు వెనుక ఎలాంటి ఫేవరిటిజం లేదు.