వారి వల్లే నేను స్వేచ్ఛగా ఆడుతున్నాను: విరాట్ కోహ్లీ
భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతోనే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. 100 శాతం ఫిట్‌గా లేకున్నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉందని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లో-స్కోరింగ్ గేమ్‌లో విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49) విలువైన ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రన్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి మ్యాచ్ అనంతరం ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నా ఆరోగ్యం బాలేదు.
'గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ ప్రదర్శన చాలా మెరుగ్గా అనిపించింది. నేను ఇంకా 100 శాతం ఫిట్‌గా లేను. గత మ్యాచ్‌లో మోకాలి నొప్పితో బాధపడ్డాను. అంతేకాకుండా.. గత నాలుగైదు రోజులుగా నా ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. అందుకే మళ్ళీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు నేను బాగా ఆడాను. మంచి ఇంటెన్సిటీతో బ్యాటింగ్ చేశాను. అయితే మ్యాచ్ ముగించి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. పిచ్ క్రమంగా నెమ్మదించింది. నేను అదే జోరును కొనసాగించాలని అనుకున్నాను. కానీ మ్యాచ్ ముగించకుండానే వెనుదిరిగాను.
ఈ పిచ్ సాధారణ వికెట్ కంటే స్లోగా ఉంది. పిచ్‌పై ఏ మాత్రం గడ్డి లేదు. గత 3-4 రోజులుగా ఎండలు చాలా ఎక్కువగా కొట్టడంతో పిచ్ పొడిగా మారింది. అందుకే ఇది చిన్నస్వామిలో సాధారణంగా ఉండే పిచ్ లాగా కాకుండా.. స్లో వికెట్‌గా మారింది. ఈ విషయాన్ని మేం ముందే పసిగట్టాం. మొదటి ఐదు-ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవాలని ప్లాన్ చేశాం. అందుకే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాం. ఈ రోజు నా బ్యాటింగ్ విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. జట్టును ఆరంభంలోనే ముందంజలో ఉంచగలిగాను.

మా టీమ్ కాంబినేషన్ అద్భుతం..
బ్యాటింగ్ యూనిట్‌గా మాకు కొన్ని ప్రణాళికలు, లక్ష్యాలు ఉన్నాయి. రజత్ పాటిదార్ క్రీజులోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేయడం అతని బాధ్యత. నేను ఎప్పుడూ అతనికి ఒకటే చెబుతుంటాను - 'నువ్వు కేవలం మ్యాచ్ పరిస్థితిని మాత్రమే కాదు, బౌలర్ల గుండె వేగాన్ని అంచనా వేస్తున్నావు' అని. నిజంగా పాటిదార్ అద్భుతం. అతనికి ఆటపై అంత క్లారిటీ ఉంది.
అలాగే మా మేనేజ్‌మెంట్ జట్టును నిర్మించిన తీరు కూడా మేం ఒక ప్రత్యేక శైలిలో ఆడేందుకు సహకరిస్తోంది. నేను, ఫిల్ సాల్ట్ ఆరంభంలో దూకుడుగా ఆడేందుకు మా బ్యాటింగ్ లైనప్ తోడ్పడుతుంది. మేము మా బాధ్యతలను ఒకరికొకరం పంచుకుంటున్నాం.
4 ఓవర్లలో 50 పరుగులు చేయగలరు..
రొమారియో ఫెఫెర్డ్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు ఉండటం టాపార్డర్ బ్యాటర్లుగా మాకు ఎంతో స్వేచ్ఛను ఇస్తోంది. కృనాల్ పాండ్యాకి అయితే ఇప్పటివరకు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మా దగ్గర ఎంతో విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ ఐదు వికెట్లు పడిపోయినా రొమారియో, టిమ్ లాంటి వాళ్లు రావడం అనేది ప్రత్యర్థి జట్టుకు భయం కలిగిస్తుంది. ఈ ఇద్దరూ చివరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయగలరు.
ఇది మా అందరికీ చాలా స్వేచ్ఛను ఇస్తోంది. అయితే ప్రతి మ్యాచ్ 230 లేదా 240 పరుగులు చేసేలా ఉండదు. ఆధునిక క్రికెట్ డిమాండ్లు మారుతున్నాయని మాకు తెలుసు. కానీ ఒత్తిడిలో ఆడుతున్నప్పుడు పరిస్థితులను గమనించడం ముఖ్యం. టోర్నీ ఇంకా మొదటి సగంలోనే ఉంది. సెకండాఫ్ సగం నుంచి మ్యాచ్‌లు మరింత కఠినంగా మారుతాయి.
ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆ సమయంలో స్వేచ్ఛ తగ్గి ఒత్తిడి పెరిగినప్పుడు, ఎవరైతే తెలివిగా, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడతారో ఆ జట్లే టోర్నీలో ముందడుగు వేస్తాయి. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పరిస్థితులకు తగ్గట్టు మారుతున్నాను. గత రెండు మ్యాచ్‌ల్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కానీ ఎప్పుడూ నా స్థాయిని పెంచుకోవడానికే ప్రయత్నిస్తాను.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications