Vaibhav Sooryavanshi: యాడ్స్ రేటు పెంచేసిన బుడ్డోడు!
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'అనే పెద్దల మాటను టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బాగా పాటిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రతలూగించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. భారత క్రికెట్‌లోనే సరికొత్త వండర్ కిడ్‌గా అవతరించాడు.
అతని విధ్వంసకరమైన బ్యాటింగ్‌కు ప్రతీ క్రికెట్ అభిమాని ఫిదా అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో వేలంలోకి వస్తే దాదాపు 30 కోట్లు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ప్రతీ సీజన్‌లో అతనికి రూ.1.10 కోట్లు చెల్లిస్తుంది.
ఐదు అవార్డులతో..
ఐపీఎల్ జీతం తక్కువగానే ఉన్నా.. ఎండార్స్‌మెంట్ ఫీజుల ద్వారా ఈ బుడ్డోడు కోట్ల రూపాయాలను ఆర్జిస్తున్నాడని అడ్వర్టైజ్‌మెంట్ నిపుణులు పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మొత్తం ఐదు అవార్డులు అందుకున్నాడు. దాంతో బుడ్డోడి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దాంతో అతని ఎండార్స్‌మెంట్ ఫీజులను రెట్టింపు చేశాడని వ్యాపార నిపుణులుపేర్కొంటున్నారు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు సంబంధించిన అతని పోర్ట్‌ఫోలియోను సూర్యవంశీ తల్లిదండ్రులు స్వయంగా చూసుకుంటుండగా.. అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా వారికి సహాయం చేస్తోంది. ఈ టీనేజర్ ఇప్పటికే 'కాంప్లాన్' 'రెడ్ బుల్' వంటి ప్రముఖ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తున్నాడు. అతని ఐపీఎల్ మెరుపుల నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని ఇతర బ్రాండ్‌లు కూడా అతనితో ఒప్పందం చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి.
రెట్టింపు చేసిన ఫీజు..
'వైభవ్ సూర్యవంశీ తన ఎండార్స్‌మెంట్ ఫీజును దాదాపు రెట్టింపు చేశాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అతను ఒక్కో డీల్‌కు దాదాపు రూ. 1 కోటి చొప్పున ఒప్పందాలు చేసుకున్నాడు. కానీ, ఇప్పుడు ఒక్కో ప్రకటనకు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు.' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అడ్వర్టైజ్‌మెంట్ నిపుణుడు మీడియాకు తెలిపారు.
15 ఏళ్ల వయసులోనే టీమిండియా టాప్ క్రికెటర్‌కు ఉండే క్రేజ్‌ను సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ అదే స్థాయిలో డబ్బులను ఆర్జిస్తున్నాడు. అయితే ఈ డబ్బులు, పాపులారిటీ నుంచి వైభవ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అతని తల్లిదండ్రులపై ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
వైభవ్ సూర్యవంశీని ఇప్పటికే సచిన్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో పలువురు విశ్లేషకులు పోల్చుతున్నారు. అతని ప్రతిభపై ఎలాంటి సందేహం లేనప్పటికీ.. ఈ యువ ఆటగాడు కెరీర్‌లో ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

