ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. కోల్‌కతా వేదికగా గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)ను ఓడించింది. అనామక ప్లేయర్ ముకుల్ చౌదరి(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్‌ను గెలిపించాడు.
మరోవైపు సునాయసంగా గెలవాల్సిన కేకేఆర్ చెత్త బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ టోర్నీలో మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. రూ.25.20 కోట్ల ఆటగాడైన కామెరూన్ గ్రీన్ కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీసాడు. కీలకమైన 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో పాటు బౌండరీతో 16 పరుగులు సమర్పించుకొని కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), అంగ్‌క్రిష్ రఘువంశీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్థ్, దిగ్వేష్ రతి, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. ముకుల్ చౌదరి(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్), ఆయుష్ బదోని(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/38), అనుకుల్ రాయ్(2/32) రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.
182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో కేకేఆర్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ఔటాఫ్ సిలబస్‌లా క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
7 భారీ సిక్స్‌లు బాది లక్నో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అతనికి ఆవేష్ ఖాన్(1 నాటౌట్) అండగా నిలిచాడు. చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 43 పరుగులు కావాల్సి రావడంతో కేకేఆర్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ముకుల్ చౌదరీ అసాధారణ బ్యాటింగ్‌తో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
కార్తీక్ త్యాగి వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ముకుల్.. కామెరూన్ గ్రీన్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక బౌండరీతో 16 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. రెండో బంతిని సిక్సర్ బాదిన ముకుల్.. ఐదో బంతిని సిక్స్ కొట్టి మ్యాచ్ డ్రా చేశాడు. ఆఖరి బంతికి క్విక్ సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
19వ ఓవర్‌లో కామెరూన్ గ్రీన్ ఒక్క సిక్స్ తక్కువ ఇచ్చినా కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచేది. అతని చెత్త బౌలింగ్ ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. రూ.25.20 కోట్ల గ్రీన్ కొంపముంచితే.. రూ.2.6 కోట్ల ముకుల్ చౌదరి లక్నోను గెలిపించాడు.