IPL 2026: కొంపముంచిన మార్కో జాన్సన్.. మళ్లీ ఓడిన పంజాబ్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. గురువారం ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్‌తో పాటు మిడిలార్డర్ వైఫల్యం పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది.

తెలుగోడి విధ్వంసం..
ముంబై ఇండియన్స్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్(4/39), దీపక్ చాహర్(2/36) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. కార్బిన్ బోష్, రాజ్ బావకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలుపొందింది . తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. విల్ జాక్స్(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(2/36) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(1/32), మార్కో జాన్సెన్(1/55) చెరో వికెట్ తీసారు.
కొంపముంచిన మార్కో జాన్సెన్..
201 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కినా.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(20)తో కలిసి తిలక్ వర్మ నాలుగో వికెట్‌కు 61 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రూథర్‌ఫోర్డ్ ఔటవ్వడం.. ముంబై పరుగుల వేగం తగ్గడంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 50 పరుగులు అవసరమయ్యాయి.
అయితే మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ ఓవర్‌లో తిలక్ వర్మ వరుసగా 6, 4, 1, 4,1, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో ముంబై విజయానికి 12 బంతుల్లో 28 పరుగులే అవసరమయ్యాయి. జాన్సెన్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే ముంబై విజయ సమీకరణం మరింత క్లిష్టంగా మారేది. మార్కో జాన్సెన్ వైఫల్యం పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులే ఇచ్చినా.. ఆఖరి ఓవర్‌లో గ్జేవియర్ బార్ట్‌లెట్ 15 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. ఈ ఓవర్‌ను విల్ జాక్స్ సిక్సర్‌తో ప్రారంభించగా.. తిలక్ వర్మ రెండు సిక్స్‌లతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

