టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతోనే తాను ఫామ్ అందుకున్నానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకోమని రోహిత్ భాయ్ సూచించాడని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై టైమ్ తీసుకొని ఆడిన తిలక్ వర్మ.. క్రీజులో సెట్ అయిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్‌తో ముంబై ఇండియన్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ.. తన సెంచరీ క్రెడిట్ రోహిత్ శర్మదేనని తెలిపాడు.
'పరుగులు లేక ఇబ్బంది పడుతున్న నాకు రోహిత్ భాయ్ విలువైన సలహా ఇచ్చాడు. క్రీజులోకి వెళ్లి 15-20 బంతులు ఓపికగా ఆడాలని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయగలవో నీకు తెలుస్తుందని సలహా ఇచ్చాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా తొలి 15 బంతులను ఓపికగా ఆడాలని చెప్పాడు. ఆ తర్వాత ఏదైతే అది అవుతుందని భరోసా ఇచ్చాడు.
రోహిత్ భాయ్ సలహా నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రోహిత్ భాయ్ చెప్పినట్లుగానే తొలి 15 బంతులు ఆడాలని మనసులో గట్టిగా అనుకున్నాను. 15 బంతులు ఆడిన తర్వాత షాట్స్ ఆడగలననే నమ్మకం కలిగింది. దాంతో స్వేచ్ఛగా నా షాట్స్ ఆడాను. ఈ సీజన్‌లో నేను పరుగులు చేయలేదంతే. ఫామ్ కోల్పోలేదు. అంచనాల భారాన్ని కూడా మోయలేదు. క్రీజులో టైమ్ తీసుకునే అవకాశం నాకు దక్కలేదు. దాంతో దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాను. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.

సూర్య భాయ్ ఫామ్‌లో లేడని నేను అనను. అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నెట్స్‌లో అద్భుతమైన షాట్స్ ఆడుతున్నాడు. బంతిని అద్భుతంగా మిడిల్ చేస్తున్నాడు. నాకైతే అతను టచ్ కోల్పోయాడని అనిపించడం లేదు. అతను ఓ భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో అతను ఎంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడో అందరికి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ గెలవకపోయి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అక్కడ సూర్య భాయ్ తన సత్తా ఏంటో చాటాడు.
టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్ల అవసరాల మేరకు తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్దంగా ఉంటా. నాకు మూడో నెంబర్‌లో ఆడటం ఇష్టమే అయినా.. జట్టు అవసరాన్ని బట్టి నంబర్ 4, 5, 6, 7 ఎక్కడైనా ఆడటానికి సిద్ధంగా ఉంటాను.
ఆ క్షణంలో జట్టుకు ఏం అవసరమో అది మాత్రమే నేను ఆలోచిస్తాను. కొన్నిసార్లు నాకు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఆటకు కొద్దిగా దూరంగా ఉండాలనిపిస్తుంది. నిద్రపోయే ముందు మానసికంగా ఎలా ఉన్నాను అని మాత్రమే ఆలోచిస్తాను. ఎక్కవ ప్రాక్టీస్ చేస్తే పరుగులు వస్తాయనే రూల్ ఏం లేదు.
ప్రపంచకప్‌లో ఆరంభంలో పెద్దగా నేను పరుగులు చేయలేదు. పరుగులు చేసేందుకు నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేశాను. కానీ తాజా ఐపీఎల్‌లో 2-3 మ్యాచ్‌ల్లో పరుగులు చేయనప్పుడు.. ఆటకు దూరంగా ఉండాలనిపించింది. నేను ప్రత్యేకంగా ఏం శిక్షణ తీసుకోలేదు. కానీ నా చిన్ననాటి కోచ్‌తో మాట్లాడాను. బ్యాటింగ్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే.. రోహిత్ భాయ్‌తో మాట్లాడుతాను.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.