ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ మ్యాచ్ ఆడేంత ఫిట్‌గా లేడని టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. హార్దిక్ అందుబాటులో లేకపోవడంతోనే సారథ్య బాధ్యతలు చేపట్టినట్లు స్పష్టం చేశాడు.
'హార్దిక్ పాండ్యాకు ఆరోగ్యం బాలేదు. ఈ మ్యాచ్ ఆడేంత ఫిట్‌గా లేడు. దాంతో నేను అతని స్థానంలో సారథ్య బాధ్యతలు తీసుకుంటున్నాను. 13-14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంతో జట్టులో చాలా సానుకూలత నెలకొంది. ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అయితే వాంఖడేతో పోలిస్తే ఇక్కడి మైదానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మేం బాధ్యతాయుతంగా ఆడి మెరుగైన ప్రదర్శన చేయాలి. ఈ పిచ్ బాగుంది. టాస్ అంత కీలకం కాదు.

మేం టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. వారు బౌలింగ్ ఎంచుకోవడంతో మేం కోరుకున్నదే మాకు దక్కింది. గతంలో ఇక్కడ మేం ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకున్నాం. జట్టులో కొన్ని మార్పులు ఉన్నాయి. హార్దిక్ స్థానంలో దీపక్ చాహర్ వచ్చాడు. బౌల్ట్ స్థానంలో కోర్బిన్ బాష్ బరిలోకి దిగుతున్నాడు. ఇది వ్యూహాత్మక మార్పు మాత్రమే. వాంఖడేలో జరిగిన గత మ్యాచ్‌లో బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగే అల్లా గజన్ఫర్ స్థానంలో మిచ్ సాంట్నర్ బరిలోకి దిగుతున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు పిచ్ కండిషన్స్ తెలుసుకునేందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నానని టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. మా హోమ్ గ్రౌండ్‌లో ఇదే మొదటి మ్యాచ్. వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలనుకుంటున్నాను. పిచ్ కొంచెం పొడిగా, హార్డ్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మేం బాగా ఛేజ్ చేశాం. పవర్‌ప్లేలో 26/4 స్కోరు వద్ద ఉన్నప్పుడు లక్ష్యాన్ని ఛేదించడం జట్టులో చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా, లోయర్ ఆర్డర్‌లో ఆదుకునే బ్యాటర్లు ఉన్నారని అందరికీ తెలుసు. హోమ్ గ్రౌండ్‌లో ఆడటం ఎప్పుడూ కలిసొచ్చే అంశం. మా ఢిల్లీ క్యాపిటల్స్ మద్దతుదారులు మా కోసం చీర్ చేస్తారు. జట్టులో ఎటువంటి మార్పులు లేవు. అదే టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కోర్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.