ఢిల్లీ ఓటమికి అతన్ని నిందించలేం: సునీల్ గవాస్కర్
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. మ్యాచ్ గెలిపించాలనే అతని ఉద్దేశాన్ని తప్పుబట్టలేమని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతిని లెగ్ సైడ్‌కు ఆడిన డేవిడ్ మిల్లర్ సింగిల్‌కు నిరాకరించాడు. దాంతో నాన్ స్ట్రైకర్ కుల్దీప్ యాదవ్ క్రీజు వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు. ఆఖరి బంతిని మిల్లర్ కనెక్ట్ చేయలేకపోవడంతో సింగిల్‌కు ప్రయత్నించిన కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
సింగిల్ తీసి ఉంటే..
డేవిడ్ మిల్లర్ చేసిన తప్పిదం కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైందని అతనిపై ఫ్యాన్స్ మండిపడ్డారు. మిల్లర్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా ఆరోపించారు. మిల్లర్ ఆ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేదని, ఆ తర్వాత కుల్దీప్ అయినా సూపర్ ఓవర్‌కు దారి తీసేదని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ గాయంతోనే ఆడి 20 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలుపు అంచులకు చేర్చినప్పటికీ, చివరి అడుగులో తడబడ్డాడు. అయితే మిల్లర్‌పై వస్తున్న విమర్శలను సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు. సూపర్ ఫామ్‌లో ఉన్న మిల్లర్.. మ్యాచ్‌ను తానే పూర్తి చేయగలనని నమ్మాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మిల్లర్ ఉద్దేశాన్ని తప్పుబట్టలేమని పేర్కొన్నారు.
మిల్లర్‌ను నిందించలేం..
అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్ షోలో మాట్లాడుతూ.. మిల్లర్‌కు అండగా నిలిచారు.'డేవిడ్ మిల్లర్ తన సామర్థ్యాన్ని నమ్మాడు. అతను అద్భుతంగా బంతిని హిట్ చేశాడు. మ్యాచ్‌ను ముగించగలనని అనుకున్నాడు. అతని ఉద్దేశాన్ని మనం తప్పుపట్టలేం. సిద్ధ్ కృష్ణ సరైన ఎత్తులో అద్భుతమైన స్లో బౌన్సర్‌ను వేయడంతో బంతిని కనెక్ట్ చేయడం కష్టమైంది. ఒత్తిడిలో ఇలా జరగడం సర్వ సాధారణం.’అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఆటపై సోయి ఉండాలి..
గేమ్ అవేర్‌నెస్ ఎంత ముఖ్యమో వివరించిన గవాస్కర్.. 1986లో ఆస్ట్రేలియాతో జరిగిన టై టెస్ట్‌ను గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో రవిశాస్త్రి కీలక సమయంలో సింగిల్ తీసి స్కోరును సమం చేశాడని చెప్పారు. 'ఇక్కడే గేమ్ అవేర్‌నెస్ చాలా కీలకం అవుతుంది. 1986లో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ టై టెస్ట్‌లో రవిశాస్త్రి సరైన సమయంలో సింగిల్ తీసి స్కోర్‌లను సమం చేసిన తీరు నాకు గుర్తుకు వస్తుంది' అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత మ్యాచ్ విషయంలో.. మిల్లర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను టై చేయాల్సింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి మ్యాచ్ గెలిపించేవాడు. క్రీజులోకి రాగానే కుల్దీప్ యాదవ్ చేసింది ఇదే. క్విక్ సింగిల్ తీసి మిల్లర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. కుల్దీప్‌పై మిల్లర్ కాస్త నమ్మకం ఉంచాల్సింది.' అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications