రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో హెన్రీచ్ క్లాసెన్ క్యాచ్‌ను ఫిల్ స్టాల్ అందుకున్న విధానం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అతను బౌండరీ లైన్ తాకినట్లు అనిపించింది. కానీ థర్డ్ అంపైర్ అన్ని కోణాల్లో పరిశీలించకుండానే ఔటివ్వడం విమర్శలకు దారి తీసింది.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్‌ను వరుణ్ చక్రవర్తీ పట్టిన విధానం కూడా వివాదాస్పదమైంది. క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలను తాకినట్లు అనిపించింది. ఈ నిర్ణయంపై అభిషేక్ శర్మ మైదానంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ కొట్టిన ఆఖరి బౌండరీ లైన్ దాటకముందే అవేశ్ ఖాన్ బ్యాటుతో లోపలికి కొట్టాడు. రూల్స్‌కు ఇది విరుద్దం. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మూడు ఘటనలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండింటిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆర్‌సీబీతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కేకేఆర్‌పై భారీ విజయం సాధించింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆవేష్ ఖాన్ చేసిన పనిపై అంపైర్లకు ఫిర్యాదు చేసి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉంది.
క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం.. బౌండరీ బయట ఉన్న ఏ వ్యక్తి అయినా(ఫీల్డర్ కాకుండా డగౌట్లో ఉన్న ఆటగాళ్లు లేదా సిబ్బంది) ఉద్దేశపూర్వకంగా బంతిని తాకినా లేదా అడ్డుకున్నా దానిని అనధికారిక జోక్యం కింద పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో అంపైర్ ఆ బాల్‌ను 'డెడ్ బాల్'గా ప్రకటించడమే కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఆ బంతికి రావాల్సిన పరుగులు ఇవ్వరు. దీనికి తోడు ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ అవేష్ ఖాన్ బౌండరీ బయట ఉండి బంతిని అడ్డుకోవడంతో ఆ బౌండరీ రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.